టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన ట్రావెల్ బస్సులను సీజ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. యాడికి మండలం కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాయి గనుల లీజులను ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి గతంలో 5 ఏళ్ల గడువు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం ఉపసంహరించుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇప్పటి వరకు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పనులు ప్రారంభం కానందున ఈ గడువును రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు 38,212 సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తవ్వకాలు జరిపి రవాణా సాగించారని దీనిపై విచారణకు ఆదేశిస్తు న్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.
ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులను ప్రభుత్వం సీజ్ చేసింది. ఇంటర్ పేజ్ క్యారియర్ పర్మిట్లలో అవకతవకలు ఉన్నాయని గుర్తించి 36 బస్సులతో పాటు మరో 18 బస్సుల కాంట్రాక్టును సైతం రద్దు చేసి సీజ్ చేసింది. బస్సుల సీజ్ అంశంలో ప్రభుత్వంపై ఆనాడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాజాగా సిమెంట్ కంపెనీ, మైనింగ్ లీజుల రద్దుపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందిం చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం కన్నా తన మైనింగ్ లీజుల రద్దు పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు. లీజుల రద్దు అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పగ పగ అంటూ రగిలిపోతుందని మాట వినని వారి మీద కక్ష తీర్చుకుంటుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే ప్రభుత్వ లక్ష్యమని దీనినే ఫ్యాక్షనిజం అంటారని వ్యాఖ్యానించారు.
ఇది ఇలా ఉంటే, జేసీ దివాకర్ రెడ్డి, ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించి, అక్కడ రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ తాత అయిన రాజారెడ్డికి తనకు ఎవరైనా అడ్డు వస్తే, వాళ్లని పైకి పంపడం బాగా తెలుసని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అందరినీ ఒకేసారి పైకే పంపే ప్లాన్ వేసారని అన్నారు. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాట పడి, ఇప్పుడు దాన్ని కక్ష తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన పై కక్ష కట్టి, తన ఆర్ధిక మూలల పై దెబ్బ కొట్టాడని, రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ అమరావతి ప్రాంత రైతులకు చేసిన దాని కంటే, తనకు పెద్ద నష్టం ఏమి లేదని అన్నారు.