సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసీ వెల్లడించారు. అయితే గత 5 ఏళ్ళుగా జగన్ పై, జేసి వేసిన సెటైర్లు అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో బూతులు కూడా తిట్టారు. అలాంటి జేసి, ఇప్పుడు జగన్ పై తన అభిప్రాయం చెప్పారు.
‘జగన్‌పై రాజకీయ విమర్శలు చేశా తప్ప ఎప్పుడూ ద్వేషించలేదు. జగన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అలాగని నేను పార్టీ మారాలనుకోవడం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంతి రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుంబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. సుహృద్భావం ఉండేదని చెప్పారు. రాజకీయాలపై ప్రస్తుతం తనకు ఆసక్తి లేదన్నారు. అయితే ఎన్నికల సంఘంలో మార్పులు చేయాల్సిన అవసరముందని జేసీ అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చిన్న చిన్న గొడవలు సహజమేనని అన్నారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని జేసీ కితాబిచ్చారు.