తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాయిదా పడిన సందర్భంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు తెలంగాణా అసెంబ్లీకి రావటం జరిగింది. అదే సమయంలో సిఎల్పీ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి చేరుకోవటంతో, అక్కడ జేసీని చూసి షాక్ అయ్యారు. తెలంగాణా కాంగ్రెస్ నేతలతో మాట్లాడాలని అనిపించిందని, చాలా రోజులు తరువాత వారిని కలవటానికి వచ్చానని అన్నారు. ఆ తరువాత, అనేక అంశాల పై జేసీ దివాకర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడటం జరిగింది. తెలంగాణా కాంగ్రెస్ నేతలకు, జేసీ దివాకర్ రెడ్డి చీవాట్లు పెట్టారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉందని, భవిష్యత్తులో కూడా అధికారంలోకి రాలేరు, కేసీఆర్ ని ఎదుర్కునే ధైర్యం మీకు లేదు అంటూ, కాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకారు. రాయల తెలంగాణా వచ్చి ఉంటే, కాంగ్రెస పరిస్థితి వేరేలా ఉండేది అని, కొంత మంది వ్యక్తిగత స్వార్ధం కోసం, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని నాశనం చేసారని వాపోయారు. జాతీయ పార్టీని, ఒక రీజినల్ పార్టీగా చేసారని వాపోయారు. ఈ సందర్భంగా అనేక అంశాల పై మాట్లాడిన జేసీ, షర్మిల అంశం పై కూడా మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డితో, ఆమెకు విబేధాలు ఉన్నాయని, అందుకే ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టిందని, ఆమెకు ఇక్కడ 5 శాతం ఓట్లు కూడా వచ్చే అవకాసం లేదని అన్నారు.
రెండేళ్ళ తరువాత, ఆమె జెండాను ఏపిలో కూడా పెడుతుందని, జగన్ ను ఇబ్బంది పెడుతుందని అన్నారు. ఇక చంద్రబాబుకు సిఐడి నోటీసులు పై జేసీ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబుకు ఒక చిన్న కాగితం, ఒక కానిస్టేబుల్ వచ్చి నోటీసులు ఇచ్చారని, కానీ జగన్ , విజయసాయి రెడ్డిలకు మాత్రం, నోటీసులు ఇవ్వాలి అంటే, లారీల్లో తీసుకుని నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉందని, అంత పెద్ద ఆర్ధిక నేరాలు వీళ్ళు చేసారని, భవిష్యత్తులో వీరికి కూడా ఈ నోటీసులు తీసుకునే అవసరం రాబోతుందని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజులు దాకా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా, అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుందని, ఎందుకు ఆలస్యం చేసారో అని సందేహం వ్యక్తం చేసారు. ఇక ఏపిలో బీజేపీ కలిసి పని చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నా, స్థానిక బీజేపీ నేతలు మాత్రం, చంద్రబాబు మీద కోపంతో ఒప్పుకోవటం లేదని అన్నారు. ఇక తాడిపత్రి విషయంలో, పూర్తి మెజారిటీ ఉందని, చైర్మెన్ పదవి టిడిపినే కైవసం చేసుకుంటుందని, ఆయన గట్టిగా చెప్తున్నారు.