ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న వైసిపీ ఎంపీ మాట్లాడుతూ, పవన్ మాకు మద్దతు ఇస్తామని చెప్పారని, 2019కి కలిసి ఎన్నికలకు వెళ్దామని చెప్పాడని చెప్పారు. మరో పక్క బీజేపీ, పవన్ కలుస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే, పవన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా బీజేపీని అనటం లేదు. అలాగే మాజీ జేడీ లక్ష్మీనారయణ కూడా బీజేపీలో చేరతారని అని వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీ సియం అభ్యర్ధి అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరో పక్క బీజేపీ, వైసిపీ, పవన్ కలిసి చంద్రబాబుని ఓడించటానికి ఇప్పటి నుంచి, కోఆర్డినేట్ చేసుకుంటూ పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, ఈ రోజు జరిగిన రెండు కీలక పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయాన్ని, రసవత్తరంగా మార్చాయి.
అందులో ఒకటి, బీజేపీ ఎమ్మెల్యేతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సమావేశం... బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వకంగానే ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లానని లక్ష్మీనారాయణ చెప్పారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ పర్యటిస్తున్నారు. రాష్ట్రం నలమూలలా పర్యటించిన తర్వాతే... తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని మాజీ ఐపీఎస్ వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
మరో పక్క, విజయవాడలో పవన్ ఇంటికి, మాజీ స్పీకర్ వచ్చారు. పవన్ కల్యాణ్‌తో అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహార్ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్‌ను కలుసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ భేటీ ఎందుకోసమని ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదు. కాగా ఆయన జనసేన పార్టీలో చేరతారానని పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. నాదెండ్ల కూడా రాజకీయ ప్రయోజనం కోసమే పవన్‌ను కలిశారా? లేదంటే మరే ఇతర రాజకీయేతర కారణలతో భేటీ అయ్యారా? అనే విషయం అంతు పట్టడం లేదు. ఇటు పవన్ నుంచి కానీ అటు నాదెండ్ల నుంచి కానీ.. ఈ భేటికీ సంబంధించిన వివరాలను వెల్లడించాకే అసలు విషయం తెలుస్తుందని అనడంలో ఆశ్చర్యం లేదు.