సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు. జగన్ మోహన్ రెడ్డి అక్రమఆస్తులు కేసు విచారణలో ఆయన ఒక సెన్సేషన్. తరువాత కొన్నాళ్ళకు పదవీ విరమణ చేసారు. పోయిన సారి 2019 ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తరువాత క్రమంలో కొన్నాళ్ళకు ఆయన జనసేన పార్టీకి దూరం అయ్యారు. పవన్ కళ్యాణ్ సీరియస్ గా రాజకీయం చేయటం లేదు అనేది ఆయన ఆరోపణ. జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆయన ఏ పార్టీలో చేరలేదు. స్వతంత్రంగా ఉంటూ సమకాలిక రాజకీయాల పై స్పందిస్తూ ఉంటున్నారు. గోదావరి జిల్లాలో పొలం కౌలకు తీసుకుని, వ్యవసాయంలో ఆధునిక సాగు పై ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన రైతుల కోసం ఏదో చేయాలి అనే ఆశయంతో ఉన్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మధ్య ఆయన తరుచూ వార్తల్లో ఉంటున్నారు. మొన్న అమరావతి వచ్చి అమరావతి రైతులకు మద్దతు పలికి, ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ, స్టీల్ ప్లాన్ పై చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతుంది. పవన్ కళ్యాణ్ రేపు విశాఖ వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రేపు ఉద్యమం చేస్తున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటూనే ఆయన ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయటం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇప్పటికే జేడీ లక్ష్మీ నారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. కోర్ట్ లో కేసు కూడా వేసి, న్యాయ పరంగా కూడా పోరాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ ఉండటంతో, ఆయన ట్వీట్ చేసారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలియజేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేసరు. అయితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ట్వీట్ చేయటం పై చర్చ జరుగుతుంది. లక్ష్మీ నారయణ మళ్ళీ జనసేనలో చేరే ఉద్దేశం ఉందా అనే చర్చ జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, అందరూ ఒక తాటి పైకి వచ్చి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తారని, ప్రజలు కూడా సహకరిస్తారని ఆశిద్దాం.