ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రోజుకి ఒక సంచలన సంఘటన దళితుల పై జరుగుతున్నాయి. దళిత సామాజికవర్గానికి చెందిన డాక్టర్లు, జడ్జిల పై దాడులు, గ్యాంగ్ రేప్ లు, శిరోమండనం, మాస్కు లేదని కొట్టి చంపటం, భూములు లాక్కోవటం లాంటి సంఘటనలు రోజు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. దీని పై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం, వింతగా ఉంటుంది. ఒక సంఘటన తీసుకుంటే, చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ ఉదంతం తెలిసిందే. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు అయిన ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తి చేస్తున్న పనుల పై, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు సంబంధించిన, జూనియర్ సివిల్ జడ్జి అయిన రామకృష్ణ గత కొన్నాళ్ళుగా పోరాటం చేస్తున్నారు. దళిత సమాజికవర్గానికి చెందిన రామకృష్ణ, పెద్దిరెడ్డి బంధువుతో గత కొన్నాళ్లుగా చేస్తున్న పోరాటం, పది రోజులు క్రితం, వికృతరూపం దాల్చి, ఏకంగా జడ్జినే కొట్టేదాకా వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక జడ్జి పైనే దాడి చెయ్యటం సంచలనంగా మారింది. ఈ విషయం అన్ని వార్తా పత్రికల్లో, చానెల్స్ లో, కొన్ని నేషనల్ మీడియా చానెల్స్ లో కూడా వచ్చాయి.
ఆరోపణలు అన్నీ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైకి వెళ్ళటంతో, ఆయన మీడియా సమావేశంలో ఈ విషయం ఖండిస్తూనే, నోరు జారారు. ఒక జడ్జిని, అదీ దళితుడుని పట్టుకుని, వాడు ఒక జడ్జి అంటూ, వాడు, వీడు అని మాట్లాడారు. దీని పై మనస్తాపం చెందిన జడ్జి రామకృష్ణ, నిన్న మంత్రి పెద్దిరెడ్డి పై, పోలీస్ కేసు పెట్టారు. తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, మంత్రి పై, కేసు పెడుతున్నాని, తగు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన పై దాడి జరిగిన విషయం పై, జూలై 15న బి.కొత్తకోట పోలీసులు, కేసు ఫైల్ చేసారని, ఆ తరువాత రోజు, అంటే జూలై 16న మంత్రి మీడియా సంవేసం పెట్టి, నన్ను అవమానకర భాషలో, వాడు వీడు అని దుషిస్తూ, కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేసారు. తన పై జరిగిన దాడి విషయంలో, మంత్రి హోదాలో ఉంటూ వెటకారంగా మాట్లాడటం రాజ్యంగా విరుద్ధం, ఆయన మాట్లాడిన మాటలు, తాను నమోదు చేసిన క్రిమినల్ కేసు ప్రభావితం అయ్యేలా ఆందని, ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా, ఎస్సీ వర్గానికి చెందిన వారిని, అవమానించే విధంగా మాట్లాడటం, నేరం అని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పరిగణలోకి తీసుకుని, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.