ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో సాగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీ.. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల జీవనానికి భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టు పనులు ఎలాంటి పేలుళ్లు, ధ్వని కాలుష్యం లేకుండా నిర్వహించాలని పేర్కొంటూనే అప్పట్లో అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ కారణంగానే వెలిగొండ టన్నెళ్లు పనులు ప్రత్యేకంగా విదేశాల నుంచి రప్పించిన టన్నెల్ బోరింగు మిషన్ల సాయంతో చేస్తున్నారు.
ఇందుకు అదనపు మొత్తాలు ఖర్చు పెడుతున్నారు. వెలిగొండ టన్నెళ్లు కాకుండా శ్రీశైలం జలాశయం నుంచి టన్నెళ్లను కలిపి హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వేరే ఏజన్సీ సాయంతో విడిగా పనులు అప్పచెప్పి చేయిస్తున్నారు. ఇక్కడ పర్యావరణ నిబంధనలు పాటించడం లేదంటూ ఆ భాజపా ఎంపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో చెన్నైకి చెందిన అటవీ పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం పరిశోధన అధికారి రెండ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి వెలిగొండ పనులను తనిఖీలు చేశారు.
వెలిగొండ పనులు జరిగే శ్రీశైలం జలాశయం ప్రాంతానికి వెళ్లి స్వయంగా ఆయన పరిశీలన జరిపినట్లు తెలిసింది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు, జంతువులకు ఎలాంటి అవరోధం కలగకుండా ఉండేందుకు కనీసం హెడ్ రెగ్యులేటర్ ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలు లేదు. ఆ పరిశోధన అధికారి జలవనరులశాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరావులను అమరావతి సచివాలయంలో కలిసి చర్చలు జరిపినట్లు తెలిసింది. వెలిగొండ పనులపై ఈ అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అసలు ఎక్కడో ఝార్ఖండ్ లో బీజేపీ ఎంపీకి, మన ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ తో ఏం పని ?