రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోవటంతో, ఎక్కువగా అప్పులు మీదే నెట్టుకువస్తున్నా సంగతి తెలిసిందే. ప్రతి నెల అప్పులతో నెట్టుకువస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, గతంలో అభివృద్ధి పనులు కోసం, చేసిన దీర్ఘకాలిక అప్పులు విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా, ఆ నిధులు మళ్ళిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివిధ రుణసంస్థల నుండి ప్రభుత్వానికి నిధులు అందుతున్నా, వాటిని ఖర్చు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాబార్డ్, జైకా, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు వంటి అనేక బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలను ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జపాన్‌కు చెందిన జైకా నుంచి తీసుకున్న రుణాల పరిస్థితి కూడా అదే మాదిరి ఉంది. తక్కువ ఖర్చుపై సమీక్షలు నిర్వహిస్తున్నా.. ప్రగతి మాత్రం కనిపించడం లేదు. 2017లో నీటిపారుదల రంగంలోని పలు పథకాల కోసం జైకా నుంచి 21,297 మిలియన్ యెన్ల రుణానికి ఒప్పందం జరిగింది.
ఈ రుణాల వినియోగం 2018 జూలై నుంచి అమలులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 457 మిలియన్ యెన్లు మాత్రమే ఖర్చు చేశారు. మొత్తం మీద 2020 మార్చిలోగా 2,795 మిలియన్ యెన్స్ పనులు జరగాల్సి ఉండగా, కేవలం 432 మిలియన్ యెన్ల విలువైన పనులు మాత్రమే జరిగినట్లు గుర్తించారు. ఇది కేవలం 15 శాతం మాత్రమే. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 1950 మిలియన్ యెన్లు వ్యయం జరగాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 25 మిలియన్ యెన్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. అంటే లక్ష్యంలో కేవలం 1.28 శాతమే సాధించారు. ఈ పరిస్థితికి నీటిపారుదల పనులను రద్దు చేయడం, మరికొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేయడం కారణమని చెబుతున్నారు. . జైకా నిధులతో చేపడుతున్న మొత్తం 20 పనుల్లో ఎనిమిది మీడియం ఇరిగేషన్ పనులు కాగా, మిగిలినవి మైనర్ ఇరిగేషన్ పనులని సమాచారం.