దేశంలోని ప్రతి వ్యవస్థని మోడీ సర్కార ఎలా నిర్వీర్యం చేస్తుందో చూస్తున్నాం. ఆ కోవలోదే గవర్నర్ వ్యవస్థ కూడా. గవర్నర్ ని అడ్డం పెట్టుకుని, కొన్ని రాష్ట్రాలలో దొడ్డి దారిని అధికారంలోకి వచ్చింది బీజేపీ, రావటానికి ప్రయత్నించి విఫలం అయ్యింది. ఇప్పుడు తాజాగా, అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా రావటానికి చూసి భంగ పడింది. ఈ విషయం జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్వయంగా చెప్పారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని ఉన్నపళంగా రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న గవర్నర్ సత్యపాల్ మలిక్.. వారంరోజుల్లోనే మరోసారి వివాదానికి తెరలేపారు. కేంద్రం చెప్పినట్లు తాను చేయలేనని, ఒకవేళ అలా చేస్తే చరిత్రలో అవినీతిపరుడిగా మిగిలేవాడినంటూ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాలిక్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
‘అప్పటి పరిస్థితుల్లో నేను దిల్లీ(కేంద్రం) వైపు చూసుంటే.. భాజపా మద్దతిస్తున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్ లోన్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటూ బలవంతంగా పిలవాల్సి వచ్చేది. కేంద్రం సాయంతో సజాద్ లోన్ ఎలాగొలా తన బలాన్ని నిరూపించుకునేవారు. అప్పుడు చరిత్రలో నేను అవినీతిపరుడిగా, నిజాయతీలేని వాడిగా మిగిలిపోయేవాడిని. కానీ నేను దాన్ని జరగనివ్వలేదు. అసెంబ్లీని రద్దు చేశాను. నన్ను తిట్టాలనుకునేవారు తిట్టండి కానీ నేను సరైన పనే చేశాను’ అని గవర్నర్ మాలిక్ చెప్పుకొచ్చారు. అంతేగాక.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా సీరియస్‌గా ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు.
గతవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేస్తున్నట్టు గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సిద్ధమంటూ... పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముందుకొచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. గవర్నర్ అకస్మిక నిర్ణయంపై అటు జమ్మూ కశ్మీర్‌లోనూ, ఇటు ఢిల్లీలోనూ ప్రత్యర్ధి పార్టీ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. గవర్నర్ నిర్ణయం ‘‘అప్రజాస్వామికమనీ, రాజ్యాంగ విరుద్ధమని’’ ఆరోపిస్తూ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. అయితే రాష్ట్ర ప్రయోనాలను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకున్నారంటూ బీజేపీ గవర్నర్‌ను వెనకేసుకొచ్చింది.