గుంటూరులో జెఎల్ఇ (జయలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్) సినిమాస్ పేరిట ఆధునిక హంగులతో, ఒకే ప్రాంగణంలో ఆరు థియేటర్లతో కట్టిన థియేటర్లు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ధియేటర్స్ అధినేత పోలిశెట్టి రాము సారధ్యంలో పలకలూరు రోడ్డులోని రమణీయం కల్యాణ మండపం ఎదుట నాలుగు ఎకరాల విశాల ప్రాంగణంలో జెఎల్ఇ సినిమాస్ పేరుతో ఆరు ధియేటర్లు రూపుదిద్దుకున్నాయి. రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా కార్పొరేట్ హంగులు, సినిమా చూసే ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతి పొందేలా సీటింగ్‌ను ఏర్పాటు చేశారు.
శృంగేరి శారదా పీఠం సీఈవో పద్మశ్రీ అవార్డు గ్రహీత విఆర్ గౌరీశంకర్ ఉదయం 9-30 గంటలకు లాంఛనంగా థియేటర్లను ప్రారంభించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, మధు, ఎన్వీ ప్రసాద్, ఏపీ ఫిలిం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఒకే ప్రాంగణంలో మొత్తం ఆరు ధియేటర్లను ఏర్పాటు చేశారు. అద్దంలా మెరిసిపోయే టైల్స్‌తో పాటు కార్పొరేట్ లుక్‌లో సీటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 4కె క్రిస్టి ప్రొజక్టర్స్ విజువల్‌తో త్రీడీ సౌకర్యం కూడా ఉంది. ఆరు థియేటర్లలో ఒక్కో థియేటర్‌కు 350 నుంచి 200 ల వరకు సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. టిక్కెట్లు రూ. 150, రూ. 250 లుగా రెండే క్యాటగిరీలు అందుబాటులోకి తెచ్చారు.