జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తుత్తుత్తి జాబ్ క్యాలండర్ పై నిరసిస్తూ, ఈ రోజు తెలుగుదేశం, వామపక్షాలకు చెందిన విద్యార్ధి సంఘాలు అన్నీ, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ముట్టడి పిలుపు ఇచ్చాయి. అయితే దీన్ని భగ్నం చేయటానికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. దాదాపుగా వెయ్యి మందికి పైగా పోలీసులను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళే మార్గాలు అన్నిటిలో మొహరించారు. ఇక వివిధ జిల్లాల నుంచే వచ్చే యువతని నిన్నటి నుంచే అరెస్ట్ లు చేస్తున్నారు. అలాగే జేసి పవన్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసారు. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని ఎలా అయినా భగ్నం చేయాలని, యువత ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం పన్నిన ప్లాన్ ఫలించలేదు. వివిధ మార్గాల ద్వారా యువత ఒక్కసారిగా మెరుపు వేగంతో క్యాంప్ ఆఫీస్ వైపు వచ్చారు. ఎటు నుంచి వచ్చారో, ఎలా వచ్చారో పోలీసులకు అర్ధం కాలేదు. ఒక్కసారిగా పోలీసులు వారిని చుట్టు ముట్టి వారిని అరెస్ట్ చేసారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తాడేపల్లి మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్ లు ఏర్పాటు చేసి, వారిని అడ్డుకుంటున్నారు. ఎవరినీ కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్ళనివ్వం అని పోలీసులు చెప్పినా, వివిధ మార్గాల్లో అక్కడకి చేరుకున్నారు.
పోలీసుల వలయాన్ని చేదించుకుని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు, శ్రీరాం చిన్న బాబు, అలాగే మిగాతా నాయకులు అంతా కూడా, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర వరకు చేరుకోవటం జరిగింది. అయితే వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, బస్సుల్లో ఎక్కించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి అరెస్ట్ ని నారా లోకేష్ సహా, ఇతర తెలుగుదేశం నేతలు ఖండించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, నల్లపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని, కేసు పెడితే ఎందుకు కేసు పెట్టారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, ఏడాదికి 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేవలం 10 వేల ఉద్యోగాలు ఇచ్చారని, ప్రతి ఏట 6500 పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేవలం 400 పోస్టులు ఇచ్చారని, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కేవలం 36 పోస్టులు ఇచ్చారని, అందుకే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎంతగా మొత్తుకున్నా, జగన్ రెడ్డి వినటం లేదు కాబట్టే, క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇచ్చామని నిరుద్యోగులు చెప్తున్నారు.