"ఢిల్లీ కోటను కూడా బద్దలు కొట్టేస్తాం"... ఇది వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన... ఇదేదో ప్రత్యెక హోదా కోసమే, పోలవరం నిధుల కోసమే, లేకపోతే మరేదో రాష్ట్ర సమస్యల కోసం అనుకునేరు. వైసీపీ నేతలకు ఢిల్లీ అంటే భయం కదా, రాష్ట్ర సమస్యల పై ఇంత మాట అన్నారా అనుకునేరు. కాదు కాదు.. జగన్ జోలికి వస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా, ఆకరుఖు ఢిల్లీ కోటను కూడా బద్దలు కొట్టేస్తాం అంటున్నారు. ఈ మాటలు మోడి గారు, అమిత్ షా గారు వింటే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ, ఈయన గారి మాటలకు మెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు, మీ మాటల్లో ఆప్యాయత కనిపిస్తుంది, ధన్యవాదాలు అంటూ, ఆయన్ను మెచ్చుకున్నారు. ఇక విషయానికి వస్తే, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు పాటు జరిగాయి. ఒక్క రోజు పాటు అసెంబ్లీ ఏమిటో అని ఆశ్చర్యపోయినంత సేపు పట్టలేదు, సమావేశాలు కూడా జగన్ గారి నామస్మరణతో, ప్రజల ఎదుర్కుంటున్న ఒక్క సమస్య పై కూడా చర్చించకుండా ముగిసిపోయాయి కూడా. బడ్జెట్ కోసమని, అదీ ఆరు నెలల లోపు సమావేశాలు పెట్టక పొతే ప్రభుత్వం పడిపోతుందని మొక్కుబడి సమావేశాలు పెట్టారు. అయితే ఈ కొద్ది పాటి సమయంలో కూడా చంద్రబాబుని, అలాగే తమ అధినేత చేస్తున్న పనులు విమర్శించే వాళ్ళని టార్గెట్ చేసుకున్నారు.
వైసీపీ ఎమ్మల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, తమ అధినేత జగన్, పేద ప్రజల కోసం అనుక్షణం తపించిపోతున్నారని, ఆయన అంత ఇదిగా పని చేస్తుంటే, చంద్రబాబుతో పాటుగా, ఇతర నేతలు తమ ప్రభుత్వం పై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తమ పార్టీలో గెలిచిన ఒక లుచ్చాగాడు, వెధవ అంటూ, రఘురామకృష్ణం రాజు పై బూతులు మాట్లాడారు. అయితే ఆయన అలా మాట్లాడుతున్నా, స్పీకర్ ఖండించలేదు. చివరకు ఏమి అనుకున్నారో ఏమో, శ్రీకాంత్ రెడ్డి వచ్చి, ఒక పేపర్ మీద రాసి ఇవ్వటంతో, వేరే సభలో ఉన్న వారి పై, ఇక్కడ మాట్లాడుకూడదు అనే నిబంధన గుర్తుకు వచ్చి, మళ్ళీ ఏమి అవుతుందో అని, క్షమాపణలు చెప్పారు. ఇదే సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి జోలికి ఎవరు వచ్చినా, ఎవరిని వదిలి పెట్టం అని, చివరకు ఢిల్లీ కోటలు అయినా సరే బద్దలు కొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో సిబిఐ కేసుల్లో ఏదైనా కదలిక వచ్చే సూచనలు ఉన్నాయని ప్రచారం జరుగుతన్న నేపధ్యంలో, జోగి రమేష్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.