గత మిత్రులు మళ్లీ ఒక్కటవుతున్నారా? కమలంతో కలిసి మెలిసి సైకిల్ ప్రయాణం సాగనుందా? తెలుగు రాష్ట్రాలకి దూరంగా తెలుగుదేశం అభ్యర్థి ఉన్నత పదవిలో బీజేపీ కూర్చోబెట్టిన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన ట్వీట్ హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది.
పోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా తెలుగుదేశం అభ్యర్థి ఎస్.సెల్వీ ఎన్నికయ్యారు. టిడిపి, బీజేపీ పొత్తులో భాగంగా సెల్వీ ఎన్నికయ్యారు. ఒప్పందంలో భాగంగా మొదటి మూడేళ్లు బీజేపీ అభ్యర్ధి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీకాలం పూర్తి కావడంతో చివరి రెండేళ్లకు టీడీపీ అభ్యర్ధి సెల్వీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ ఐల్యాండ్ టీడీపీ యూనిట్‌కు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ సెల్వీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. బీజేపీ-టీడీపీ పొత్తుతో సమైక్యంగా విజయం సాధించడం హర్షణీయమంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. కూటమికి అభినందనలు తెలియజేశారు. పోర్ట్‌బ్లెయిర్ ప్రజల కోసం చేసిన కృషి, అంకితభావం ఫలించాయని, ప్రధానిపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని నడ్డా ట్వీట్లో తెలిపారు. పోర్టుబ్లెయిర్‌లో పొడిచిన ఈ పొత్తు, తెలుగురాష్ట్రాల్లో వికసించనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల వరకూ వైసీపీ కోసం ఎంతకైనా తెగించేలా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన కేంద్రంలోని బీజేపీ, ఇటీవల వైసీపీకి దూరం అవుతూ వస్తోందని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ సర్కారుకి తీవ్రమైన ప్రజావ్యతిరేకతని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలంటే తెలుగుదేశం సహకారం తీసుకోవచ్చనే ఉద్దేశంతోనే బీజేపీ స్టాండ్ మార్చుకుందని వార్తలు వస్తున్నాయి.
టిడిపి పైన జేపీ నడ్డా ట్వీట్ దేనికి సంకేతం ? జగన్ కు టెన్షన్ మొదలైందా ?
Advertisements