సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల్లోని ఆంధ్రులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి ఏపీలోని తమ సొంతూళ్లకు చేరుకుని ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఆర్టీసీ, రైల్వే శాఖలపై ‘సంక్రాంతి’ తరహా ఒత్తిడి కనిపిస్తోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో సుమారు 35లక్షల మంది వరకూ ఆంధ్రా ఓటర్లున్నట్లు ఓ అంచనా. పెద్ద పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు ఏవిధంగా అయితే ముందుగానే ప్రయాణ రిజర్వేషన్ చేయించుకుంటారో.. ఈ ఎన్నికల్లోనూ అదే తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే తెలంగాణా ప్రభుత్వం, ఏప్రిల్ 10న, అక్కడ నుంచి ఏపిలోని వివిధ ప్రదేశాలకు వచ్చే బస్సులను రద్దు చేస్తుంది అంటూ, సోషల్ మీడియాలో కధనాలు వస్తున్నాయి. ఆర్టీసీ ఒక్కటే కాక, ప్రైవేటు బస్సులు కూడా ఏపి వైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, దీని కోసం సాకుగా, తెలంగాణాలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చూపిస్తున్నారని అంటున్నారు. మా రాష్ట్రంలో కూడా ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్ నుంచి, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతామని, ఏపి వైపు పంపటం కుదరదని, తెలంగాణా చెప్తున్నట్టు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ నుంచి ఏపీకి రోజూ 615 బస్సులు తిరుగుతుంటాయి. వీటిలో 105 బస్సులు ఒక్క హైదరాబాద్ నుంచే నడుస్తాయి.
ఇక ఏప్రిల్ పదో తేదీ రాత్రి రైళ్ళు అన్నీ ఫుల్ కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే పలు రైళ్ల స్లీపర్‌క్లా్‌సలో వెయిటింగ్ లిస్ట్ 200 నుంచి 400కు చేరుకుంది. దీంతో ఆయా రైళ్లల్లో బుకింగ్ ఆపేశారు. ఏసీ బోగీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నరసాపూర్, గౌతమి ఎక్స్‌ప్రె్‌సలలో స్లీపర్ క్లాస్ వెయిటింగ్ లిస్ట్ 401కు చేరింది. ఏపీ మీదుగా ఒడిసా, కోల్‌కతా వెళ్లే రైళ్లలోనూ ఇదే రద్దీ ఉంది. గరీభ్‌రద్‌లోనూ ఇదే పరిస్థితి. ఏప్రిల్ 11న ఓటేసిన తర్వాత తిరిగి వెళ్లేవారికి రిజర్వేషన్ ఉంటే సరే. లేదంటే చుక్కలు తప్పవు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14, 15 తేదీల వరకూ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. అందుకే దక్షిణమధ్య రైల్వే రద్దీని దృష్టిని పెట్టుకుని అదనపు బోగీలు, లేదా ప్రత్యేక రైళ్లను వేయడంపై పోలింగ్ రోజుకు కొద్ది రోజుల ముందుగా నిర్ణయం తీసుకుంటామని విజయవాడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ సీహెచ్ సురేశ్ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజూ 24 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.