దసరా పండుగ రోజున, తెలుగుదేశం పార్టీలో గత నాలుగేళ్ళుగా ఉన్న కోవర్ట్ వెళ్లిపోయాడని, పార్టీకి పట్టింది ఈ రోజుతో వెళ్ళిపోయిందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషిస్తున్నారు. ఇన్నాళ్ళు ఇతను కోవర్ట్ అని తెలియక, చంద్రబాబు అతనికి, పార్టీలో టాప్ స్థానం ఇచ్చారని, చివరకు, ఇక్కడవి అన్నీ అక్కడ చేరవేసి, పార్టీకి నష్టం చేసి, ఈ రోజు పార్టీ వదిలి వెళ్లిపోయారని, చంద్రబాబు ఇకనైనా, ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. ఆ నేతే జూపూడి ప్రభాకర్. చంద్రబాబు ఆయనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఎమ్మెల్సీ కూడా చేద్దామని అనుకున్నారు. కాని చివరలో, ఏదో టెక్నికల్ ఇబ్బంది వచ్చి, పదవి చేజారింది. అయినా జూపూడికి ఏదో ఒకటి చెయ్యాలని, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ చేసారు చంద్రబాబు. అయితే కొంత మంది అధికారం లేకపోతె ఉండలేరు కదా, అందుకే ఇప్పుడు జూపూడి జంప్ కొట్టారు.
ఈ రోజు జగన్ సమక్షంలో వైసిపీలో చేరిన జూపూడి, తండ్రి లేని జగన్ కు అండగా ఉండటానికి, ఆయన వద్దకే వచ్చానని, నేను దారి తప్పిన గొర్రె లాగా అటు వైపు వెళ్లానని, ఇప్పుడు తప్పు తెలుసుకుని, ఇటు వచ్చానని చెప్పారు. జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు. ఆంధ్రా ఐరన్ మ్యాన్ విజయసాయిరెడ్డి అని చెప్పారు. పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. పార్టీని ఎన్నో ఏళ్లగా అంటిపెట్టుకుని ఉన్న నేతలను కాదని, సామాజిక నేపథ్యం దృష్ట్యా, జూపూడి లాంటి వారికి అందలం ఎక్కిస్తే, ఏమవుతుందో, ఇప్పటికైనా అధిష్టానం తెలుసుకోవాలని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. 2014లో వైసీపీ తరుపున ఎమ్మేల్యేగా పోటీ చేసి, ఓడిపోయి, చంద్రబాబు వద్దకు వచ్చి, పదవి పొంది, ఇప్పడు టిడిపి ఓడిపోగానే, అటు జంప్ కొట్టారని, ఇలాంటి రాజకీయం నడుస్తుందని అంటున్నారు.
ఇక జూపూడి పార్టీ మార్పు పై, తెలుగుదేశం శాసనసభ్యుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందిస్తూ, " జూపూడికి అధికారమే పరమావధి. అందుకే అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండడానికి జూపూడి ప్రయత్నిస్తారు. గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి ప్రభాకర్ రావు వైఖరి ఉంది. గతంలో దళిత పులిని అంటూ ప్రకటన చేసుకుని నేడు ఆ దళితులను వంచిస్తూ.. వైసీపీలో చేరారు. 'జగన్ కాలకేయుడు, ప్రమాదకరమైన విషం' అంటూ గతంలో విమర్శించారు. జగన్ ఓ సైకో.. అందుకే తండ్రి బతికున్నంత కాలం దూరంగా ఉంచారని నాడు వ్యాఖ్యానించి.. నేడు తండ్రి లేని వ్యక్తికి తోడుగా నిలవడానికి వెళ్తున్నా అనడం జూపూడి ప్రభాకరరావు అవకాశవాదానికి నిదర్శనం. అక్రమాస్తులతో ఏర్పాటైన పార్టీ, అవినీతి పరుల పార్టీ అంటూ వైసీపీని జగన్మోహన్ రెడ్డిని గురించి పేర్కొన్న జూపూడి నేడు వారి చెంతకు ఎందుకు వెళ్లినట్లు.? అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఫెడల్ క్యాస్ట్రోతో పోల్చడం సిగ్గుచేటు. జైలుకు వెళ్లొచ్చిన వారంతా ఉద్యమకారులు కాదనే విషయం జూపూడి గుర్తించాలి. జగన్ ఏ కారణంగా జైలుకు వెళ్లారో ప్రజలందరికీ తెలుసు. పోలిక విషయంలో అయినా జూపూడి కాస్త ఆలోచించి మాట్లాడాలి. జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనని ప్రజలు గుర్తిస్తున్నారు. దళిత నాయకుడిగా జూపూడి వైసీపీలో చేరి అన్యాయం చేశారు. రంగులు మార్చడంలో ఊసరవిల్లితో పోటీపడుతూ... దళితుల్ని నిలువునా వంచిస్తున్నారు. జగన్‌ను నమ్మి వెళ్లడమంటే కుక్కతోక వంకర అనే విషయాన్ని జూపూడి గుర్తించాలి." అని అన్నారు.