సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన దాదాపు ఏడేళ్లు సేవలందించారు. అయితే ఈ సందర్భంలో, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ అదిరిపోయే ట్వీట్ చేసారు... ఇది ఆయన ట్వీట్ "Justice Chelameshwar retires from SC today; he and wife packed their bags, left their Govt bungalow at 5 am for his village. Bungalow handed over exactly as he got it 6 years go! How many netas would do this? Inspiring! Salute you sir! Not everyone is trapped in VVIP culture!"
1953 జూన్ 23న జన్మించిన జస్టిస్ చలమేశ్వర్ స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని పెదముత్తేవి. మచిలీపట్నంలో పాఠశాల విద్య, చెన్నైలో కళాశాల విద్య పూర్తయ్యాక 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1995లో సీనియర్ న్యాయవాది అయ్యారు. ఏపీ, గువాహటి, కేరళ హైకోర్టులకు సేవలందించాక 2011 అక్టోబరు 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. . ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై సహచర న్యాయమూర్తులతో కలిసి జనవరి 12న విలేకరుల సమావేశంలో ఆయన చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అవుతుందని చరిత్రాత్మక తీర్పు ప్రకటించిన తొమ్మండుగురు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని రద్దు చేసిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయన ఒకరు.
కొలీజియం సిఫార్సులు అపారదర్శకంగా ఉంటున్నాయని తప్పుపట్టిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్. మరోపక్క- ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే అంశంపై డోలాయమాన పరిస్థితి మరికొంత కాలం కొనసాగడం అనివార్యంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సిఫార్సు చేయగా ప్రభుత్వం దానిని తిప్పిపంపడం, జస్టిస్ జోసెఫ్ పేరునే పునరుద్ఘాటించాలని కొలీజియం భావించడం తెలిసిందే. పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ చలమేశ్వర్ స్థానంలో మరో న్యాయమూర్తి కొలీజియంలోకి రావాల్సి ఉంది.