జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా ? ఈయన మాజీ హైకోర్టు జడ్జి. మన రాష్ట్రం కాదు, తమిళనాడు. అయితే ఎందుకో కానీ, ఈయన అంటే ప్రభుత్వ పెద్దలకు ఎక్కడ లేని మోజు. ఆ మోజు ఎందుకు అనేది ఇప్పటికీ తెలియదు. ఇప్పటికే ఆయనకు రెండు కీలక పదవులు ఇచ్చారు. రెండు పదవులు రూల్స్ కి విరుద్ధంగా ఇవ్వటంతో, కొంత మంది కోర్టుకు వెళ్ళటంతో, రూల్స్ ప్రకారం కనగరాజ్ నియామకం చెల్లేదని కోర్ట్ ఆ పదవుల నుంచి తొలగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఆయన పదవి కోర్టు ద్వారా పోయింది. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం వదలటం లేదు. ఆయనకు ఈ సారి మూడో పదవి కూడా కట్ట బెట్టింది. 80 ఏళ్ళ వయసులో ఆయన పైన ఇంత ప్రేమ ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకు ఆయనకు పదవులు ఇవ్వాలనే ఆరాటం ప్రభుత్వ పెద్దలకు ఉందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇప్పుడు తాజాగా ఆయనకు ఒక కమిటీలో మెంబెర్ గా పదవి ఇచ్చారు. పీడీ చట్టం సలహా మండలిలో ఆయనకు చోటు ఇచ్చారు. పీడీ చట్టం అంటే, ప్రివెన్షన్ డిటెన్షన్. ఇది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఈ సలహా మదలనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ, ఇందులో ఒక మెంబెర్ గా మాత్రమే కనగరాజ్ ని నియమించారు. ఆయనకు ఈ సలహా మండలి చైర్మెన్ పదవి మాత్రం ఎందుకో కానీ ఇవ్వలేదు.
ఈ పీడీ చట్టం సలహా మండలి చైర్మెన్ గా, మరో హైకోర్టు జడ్జిని నియమించారు. ఆయన పేరు సంజీవ రెడ్డి. అయితే ఈయన కూడా ఎప్పుడో పని చేసారు. ఇప్పుడు ఈయనకు 85 ఏళ్ళు. మరి ఇంత వయసు ఉన్న వాళ్ళను చైర్మెన్ గా, మెంబెర్లుగా నియమించి, ఏమి చేద్దామని అనుకుంటున్నారో తెలియదు కానీ, మొత్తానికి పదవులు అయితే ఇచ్చేస్తున్నారు. అయితే ఇది కూడా ముఖ్యమైన మండలి కావటం, దీనికి కూడా రూల్స్ ఉంటాయి కాబట్టి, ఇంత వయసు ఉన్న వారికి ఈ పదవి ఇవ్వచ్చో ఇవ్వకూడదో చూడాలి మరి. మళ్ళీ ఎవరైనా ఏదైనా రూల్ పట్టుకుని కోర్టుకు వెళ్తే, కనగరాజ్ పదవి ఉంటుందో, పోతుందో చూడాలి. ముందుగా ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమిద్దామని తీసుకుని వచ్చారు. అయితే నిమ్మగడ్డ వెంటనే కోర్టుకు వెళ్లి, ఆయన నియామకం క్యాన్సిల్ చేపించారు. తరువాత మళ్ళీ ఆయనకు రెండో పదవి ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్‌గా నియమించారు. అయితే ఇది కూడా రూల్స్ కు వ్యతిరేకం కావటంతో, ఇది కూడా ఊడింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి పదవి ఇచ్చారు. మరి ఇది ఏమి అవుతుందో చూడాలి.