జస్టిస్ కనకరాజ్ గుర్తున్నారా ? ఏడాది క్రితం, రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎలక్షన్ కమీషనర్ ని మార్చేసి, రాత్రికి రాత్రి అంబులెన్స్ లో చెన్నై నుంచి, అమరావతి తీసుకువచ్చి, ఆయనకు బాధ్యతలు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. క-రో-నా ఉన్నా, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు లేకపోయినా, ఆయన్ను అంబులెన్స్ లో తీసుకుని వచ్చారు. అయితే తరువాత ఎన్నికల కమీషనర్ గా నియమించినా, హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలతో, ఆయన పదవి పోయింది. మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా ఎన్నికయ్యారు. ఇక పోతే, ఆయనకు సంబంధించిన కొన్ని బిల్స్ విషయంలో కూడా కోర్టులలో కేసులు నడిచాయి. దాదాపుగా 80 ఏళ్ళు ఉన్న జస్టిస్ కనకరాజ్ ను జగన్ ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ గా నియమించాలని చేసిన ప్రయత్నం ఫ్లాప్ అవ్వటంతో, గత ఏడాదిగా ఆయనకు పదవి లేకుండా పోయింది. అయితే ఈ జస్టిస్ కనకరాజ్ పై ప్రభుత్వ పెద్దలకు ఉన్న ఇష్టం ఏమిటో కానీ, ఇప్పుడు తాజాగా ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మళ్ళీ ఇంకో కొత్త పదవి ఇచ్చి మరీ, ఆయనకు లబ్ది చేకూర్చారు. కొత్త పదవి సృష్టించి మరీ, కొత్త పదవి ఇవ్వటం, మరో హైలైట్. జస్టిస్ కనకరాజ్ పై, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉన్న మక్కువ ఏమిటో కానీ, ఇప్పుడు ఆయనకు కొత్త పదవి ఒకటి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
రాష్ట్ర పోలీస్ కంప్లెంట్స్ అథారిటీ ఛైర్మన్‍గా, జస్టిస్ కనగరాజ్ ని నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో జస్టిస్ కనకరాజ్ మూడేళ్ళు ఉండనున్నారు. మూడేళ్ళ పాటు ఈ పదవి ఉంటుంది అంటూ ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ రాష్ట్ర పోలీస్ కంప్లెంట్స్ అథారిటీలో మరో ముగ్గురు సభ్యులు కూడా ఉంటారు. ఇంకా ముగ్గురు సభ్యులు ఎవరో తెలియలేదు. అయితే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కంప్లెంట్స్ అథారిటీని నెలకొల్పింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, రాష్ట్ర పోలీస్ కంప్లెంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది. పోలీసులు పై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా, వారు కేసు తీసుకోక పోయినా, మరే ఇతర ఫిర్యాదులు ఉన్నా, ప్రజలు ఈ రాష్ట్ర పోలీస్ కంప్లెంట్స్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే రాష్ట్ర పోలీస్ కంప్లెంట్స్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు ఇస్తుంది. మొత్తానికి, ఈ పదవిలో జస్టిస్ కనకరాజ్ ను ప్రభుత్వం కూర్చోబెట్టింది.