ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ కనకరాజ్ కు భారీ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా ఇటీవల జస్టిస్ కనకరాజ్ ని నియమిస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ కనకరాజన్ ను నియమిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ, హైకోర్టు న్యాయవాది కిషోర్ పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ తరుపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. అందులో ప్రధానంగా రెండు విషయాలు తమ వాదనల్లో హైకోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా, సుప్రీం తీర్పునకు విరుద్దంగా ఈ నియామకం ఉందని వాదించారు. అదే విధంగా, పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ ను నియమించటానికి కొన్ని, నిబంధనలు పాటించాలని, ఆ నిబంధనలకు విరుద్దంగా అవి పాటించకుండా, ప్రభుత్వం జీవో జారీ చేసిందని అనేది పిటీషనర్ తరుపున వాదనలు విన్పిస్తూ తెలిపారు. అలాగే మరో అంశంగా, ఆయన వయోపరిమితి గురించి ప్రస్తావించారు. వయోపరిమితికి చాలా వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ నిబంధనలకు ప్రస్తుతం, ఆయన ఉన్న వయోపరిమితి, చాలా తేడా ఉందని కూడా ధర్మాసనం ముందు వాదించారు.
పిటీషనర్ తరుపున వాదనలు విన్న తరువాత, హైకోర్టు తమ తీర్పు ని ప్రకటించింది. జస్టిస్ కనకరాజ్ ని పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా నియమిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జస్టిస్ కనకరాజ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆయన కానీ, ప్రభుత్వం కానీ సుప్రీం కోర్టు కు అపీల్ కి వెళ్తుందేమో చూడాలి. ఈ తీర్పుతో జస్టిస్ కనకరాజ్ ను రెండో సారి షాక్ తగిలినట్టు అయ్యింది. మొదటిసారిగా, ఆయన్ను ఎన్నికల కమీషనర్ గా నియమించారు. లాక్ డౌన్ ఉన్నా సరే, ఆయన్ను చెన్నై నుంచి తీసుకుని వచ్చి మరీ, రాత్రికి రాత్రి ప్రమాణస్వీకారం చేయించారు. చివరకు ఆయనకు రెండు కోర్టుల్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది. అయితే అప్పట్లో ఆయనకు చెల్లించిన కొన్ని ఖర్చులు కూడా ఆయనే పెట్టుకోవాలని తీర్పు కూడా వచ్చింది. ఇప్పుడు ఇలా మ్యానేజ్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ కూడా కనకరాజ్ కు ఎదురు దెబ్బ తగిలింది.