ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ మహేశ్వరీ, ఈ రోజు బదిలీ పై సిక్కిం వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టులో వీడ్కోల సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జస్టిస్ మహేశ్వరి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాటల్లో "నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఎంతో కష్టపడి ఈ స్థానానికి వచ్చాను. తాన పై ఎంతో మంచి అభిప్రాయం వ్యక్తం చేసారని, నేను ఈ సన్మానానికి అర్హుడినో కాదో కానీ, నేను కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడకు వచ్చిన తరువాత, ఎంతో మంది సహచరులతో కలిసి, ఎన్నో ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాలతో ముందుకు వెళ్ళాం. ఆ ఫలితాలే, మన పై వస్తున్న ప్రశంసలు. ఇక్కడ అందరూ నాకు బలం. నేను అనుకున్నదాని కంటే, ఎక్కువగా పని చేసారు. నాతో పాటు పని చేసిన అందిరకీ కృతఙ్ఞతలు. నేను ఎప్పుడైనా కోప్పడినా, ఏమి పట్టించుకోకుండా పని చేసే వారు. ఉదయం నుంచి రాత్రి దాకా నాతో కలిసి కష్టపడ్డారు. ఒక్కోసారి 10 గంటల దాకా పని చేసాం. నేను ఒక్కడినే పని చేస్తే ఏమి అవ్వదు. అందరూ కలిసి చేస్తేనే ఆ పని అవుతుంది. నాలాంటి జడ్జీలు ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చిరస్థాయిగా నిలిచి పోతాయి. ఈ వ్యవస్థ కోసం పని చేసే మనస్తత్వం ఉంటే, ప్రతి ఒక్కరి పనికి గుర్తింపు ఉంటుంది, ఈ వ్యవస్థకు మరింత గౌరవం పెరుగుతుంది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు రిజిస్టార్ రాజశేఖర్ గారిని మాత్రం మర్చిపోలేను.
"ఆయన ఎంతో కష్టపడి పని చేసేవారు. నేను ఒకటి అయితే చెప్పగలను, ఆయన ఏదైనా చెప్పారు అంటే, అది కరెక్ట్ అయి తీరుతుంది. రిజిస్టార్ జనరల్ ఎలా ఉండాలో ఆయన ఒక ఉదాహరణ. ఆయన క-రో-నాతో మృతి చెందటం బాధకారం. ఈ సందర్భంగా అయన సేవలు గుర్తు చేసుకోవాలి. కొత్త రాష్ట్రం కావటంతో, ఎన్నో సెట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అధిగమిస్తూ వచ్చాం, కొన్ని ఇంకా జరుగుతున్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా, అవి పట్టించుకో దలుచుకోలేదు. అందరం కలిసి ముందుకు వెళ్లాం. నిష్క్రమణ ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. నేను ఈ ప్రాంతం విడిచి వెళ్తున్నాను. ఇక్కడ నా పై చూపించిన ప్రేమ, నాకు ఇక్కడ అందరి నుంచి లభించిన సహకారం, నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. నా గుండెల్లో దాచుకుంటాను. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, నన్ను క్షమించండి. నా తోటి జడ్జిలకు బెస్ట్ అఫ్ లక్." అంటూ తన ప్రసంగం ముగించారు. ఇక అమరావతిలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున వీడ్కోలు పలకటం కోసం వచ్చారు. రోడ్డుకు ఇరు వైపులా నుంచున్నారు. దారి పొడుగూతూ పూలు చల్లారు. జాతీయ జెండాలు పట్టుకుని, ఆయనకు ఘనమైన వీడ్కోలు పలకటానికి సిద్ధం అయ్యారు. ఈ రాష్ట్రంలో న్యాయం ఇంకా బ్రతికే ఉందని చాటి చెప్పిన మహేశ్వరి గారికి, ఘనమైన వీడ్కోలు పలకటానికి వచ్చాం అని చెప్పారు.