ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు, ఈసీ తీరు పై అన్ని పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. జగన్, బీజేపీ, కేసీఆర్ తప్ప, దేశంలోని అన్ని పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయి. తాజగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ ఎన్నికల నిర్వహణపై మొదటినుంచి అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్వరాన్ని మరింత పెంచిన కేఏ పాల్.. ఏపీ ఎన్నికల తీరుతెన్నులపై సీఈసీ కి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు. 8 ప్రశ్నలు సంధిస్తూ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఓ లేఖ అందించారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు లిఖిత పూర్వకమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘానికి కేఏ పాల్ సంధించిన 8 ప్రశ్నలివే : 1. పోలింగ్ ప్రక్రియ ఎందుకు ఆలస్యమైంది?.. అర్ధరాత్రి వరకు కొనసాగించాల్సిన అవసరమేంటి? 2. పోలింగ్ ఆలస్యానికి బాధ్యత ఎవరిది?.. అసలు అంత జాప్యం జరగడానికి కారణమేంటి? 3. వీవీప్యాట్ స్లిప్పులకు 3 సెకండ్ల సమయం ఎందుకు తీసుకుంది ? 4. ఈవీఎంల్లో ప్రజాశాంతి పార్టీకి చెందిన 12వ బటన్ నొక్కితే.. వైసీపీకి చెందిన 2వ నెంబర్ కు ఓట్లు ఎందుకు పడ్డాయి?.. 5. పోలింగ్ సమయంలో జరిగిన దాడులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు ? 6. 80 శాతం ఈవీఎంలు ఎందుకు పనిచేయలేకపోయాయి?.. దీనిపై మీ సమాధానమేంటి? 7. ఓటర్ల ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా తీసుకోకపోవడానికి కారణాలేంటి? 8. కేంద్రం నుంచి వచ్చే పోలింగ్ ఆబ్జర్వర్లను దక్షిణాది వారిని కాకుండా ఉత్తరాది వారిని ఎందుకు సెలెక్ట్ చేశారు?
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైన కేఏ పాల్.. జాతీయ పార్టీల నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, జేడీఎస్ తదితర పార్టీల మద్దతు ఉందంటున్నారు. తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. న్యాయపోరాటంలో భాగంగా ఒకటి, రెండ్రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న కేఏ పాల్.. థర్డ్ ఫేజ్ నుంచి లోక్‌సభ ఎన్నికలు రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం కావాలని కోరారు. అలాగే చంద్రబాబుని కూడా తనతో కలిసి, మోడీ పై పోరాటం చెయ్యాలని కోరతానని చెప్పారు.