పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి కిలారి ఆనంద్(కేఏ పాల్) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ఆయన శుక్రవారం నామపత్రాన్ని కూడా దాఖలు చేశారు. కానీ నామినేషన్‌కు సంబంధించి ఆయన ప్రాథమిక వివరాలతో కూడిన దరఖాస్తును మాత్రమే అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఆ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్‌లో ఆయన చాలా భాగం ఖాళీగా వదిలేశారు. నామినేషన్ పేపర్లపై అధికారులు చెప్పే వరకు ఫోటో కూడా అంటించలేదు. విద్యార్హతలేంటో కూడా ఆయన వెల్లడించలేదు. తన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీలను మాత్రమే ఆయన వెల్లడించారు. అంతేకాక నామినేషన్‌కు అవసరమైన పూర్తి పత్రాలు కూడా కేఏ పాల్ అందించలేదని వారు తెలిపారు.
కిలారి ఆనంద్ పేరుతో ఆయన నామినేషన్ వేశారు. ఇదే ఆయన అసలు పేరు. విశాఖపట్నంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్‌గా కేఏ పాల్ పేర్కొన్నారు. కానీ తన నామినేషన్‌ను ప్రపోజ్ చేస్తున్న అభ్యర్థుల పేర్లు మాత్రం ఆయన రాయలేదు. తన వయసు 55 ఏళ్లు, పోటీ చేస్తున్నది ప్రజాశాంతి పార్టీ అని మాత్రమే అందులో రాసి ఉంది. కులం, మతం లాంటి వివరాలేవీ అందులో రాయలేదు. నామినేషన్ ప్రక్రియలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించే అఫిడవిట్‌ను ఆయన జత చేయలేదు. కానీ తన చేతిలో రూ.30 వేల క్యాష్ ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకు ఖాతాతో పాటు ఇతర వివరాలకు సంబంధించి కూడా ఖాళీ ఫారాలు మాత్రమే కేఏ పాల్ జత చేశారని అధికారులు తెలిపారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలన్నింటిని ఈనెల 25వ తేదీలోపు అందజేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారి ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. మార్చి 26న ఆయన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు.
ఇది ఇలా ఉంటే, కేఏ పాల్ బసచేసిన విజయవాడ, హోటల్ ఐలాపురంపై ఈ ఉదయం నుంచి పోలీసు దాడులు జరుగుతున్నాయి. కేఏ పాల్, హోటల్ లోని 301 నంబర్ రూమ్ లో బసచేసి వుండగా, బీ-ఫారాల జారీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని అభియోగాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన తన సహాయకుల నిమిత్తం అదే హోటల్ లో బుక్ చేసుకున్న రూముల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. పార్టీ టికెట్ ఇచ్చేందుకు కేఏ పాల్ డబ్బులను వసూలు చేశారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొందరు బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్ కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో వారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.