నిన్న కేఏ పాల్ నామినేషన్ చెల్లదు అంటూ, వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు మాత్రం, అందరికీ షాక్ ఇస్తూ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. కేఏ పాల్ నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) చేపట్టారు. పత్రాలు అన్నీ సరిగా ఉన్నందున నర్సాపురం లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్ వేసిన నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు.
అయితే తన నామినేషన్‌ను తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జగన్‌కి ఓటేస్తే అవినీతిని సమర్థించినట్లేనని ఆయన అన్నారు. పవన్‌కు ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని, అసలు ఆయనకు ప్రజాసేవ చేసే ఉద్దేశ్యమే లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనను గెలిపిస్తే ఏడాదిలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని అమెరికాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. సోమవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియడంతో మంగళవారం నుంచి పరిశీలన మొదలైంది. మార్చి 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ల చివరి తేదీ నాటికి ఏపీలో మొత్తం 3245 నామినేషన్లు అసెంబ్లీకి, 472 నామినేషన్లు లోక్‌సభకు దాఖలయ్యాయి. వీటిల్లో అధికారులు ఎన్నింటికి ఆమోద ముద్ర వేస్తారన్నది చూడాలి.