ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌కు షాక్ తగిలింది. నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. భీమవరంలో కేఏ పాల్ నామినేషన్‌ను వేసేందుకు వచ్చారు. ఆలస్యంగా వచ్చారంటూ నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. నరసాపురంలో ఎంపీ నామినేషన్‌ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారని కేఏ పాల్ మండిపడ్డారు. గెలుస్తానన్న భయంతో భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ విమర్శించారు. నరసాపురంలో ఎంపీగా గెలిచి నేనేంటో చూపిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయడానికి పాల్ వెళ్లగా.. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన కేఏ పాల్.. సోమవారం (మార్చి 25) మధ్యాహ్నం భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు. అంతకుముందే తన బంధువు ఒకరితో నామినేషన్ పత్రాలను పంపించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. పాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఆయన తన నామినేషన్ పత్రాలపై సంతకం చేయాల్సి ఉండగా.. అప్పటికే సమయం అయిపోయిందని అధికారులు నిరాకరించారు. మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు సోమవారం సాయంత్రంతో సమయం ముగిసిన విషయం తెలిసిందే.
తన నామినేషన్‌ను నిరాకరించడం వెనుక కుట్ర దాగి ఉందని పాల్ ఆరోపిస్తున్నారు. అధికారులు ఉద్దేశ పూర్వకంగానే అలా చేశారని ఆరోపిస్తున్నారు. అటు లోక్ సభ ఎన్నికలకు పోటీ చేస్తానని చెప్పిన కేఏ పాల్.. ఇప్పటికే నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం అదే స్థానం నుంచి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆలస్యంగా భీమవరం చేరుకున్నారు. నర్సాపురం పార్లమెంట్ స్థానానికి కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో వివరాలు సరిగా పొందుపరచలేదని చెబుతున్నారు. అదే జరిగితే పాల్‌కు మరో షాక్ తప్పదు.