ఏపీ ఎన్నికల్లో గెలుపు తమదే అనే ధీమాలో ఉంది ప్రతిపక్ష వైసీపీ. ఈ సారి ఏర్పడబోయేది తమ ప్రభుత్వమే అని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తమ గెలుపు గురించి ఏమీ వ్యాఖ్యానించలేమని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ, జనసేన పోటీ కారణంగా వైసీపీ ట్రయాంగిల్ ఫైట్ ఫేస్ చేసింది. అయినా ఈ పోటీలో గెలుపు తమదే అని నమ్మకంగా ఉంది. అయితే పోటీ హోరాహోరీగా ఉన్న సమయంలో తమను ప్రజాశాంతి పార్టీ దెబ్బతీస్తుందేమో అనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ప్రజాశాంతి పార్టీకి చెందిన అభ్యర్థులకు సంబంధించిన పేర్లతో పాటు ఆ పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు హెలికాప్టర్ కూడా తమ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్‌ను పోలి ఉండటం వైసీపీ అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన టీఆర్ఎస్‌ను కొన్ని చోట్ల ట్రక్కు సింబల్ టెన్షన్ పెట్టింది. నకిరేకల్ లాంటి స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ట్రక్కు కారణమైందనే వాదనలు ఉన్నాయి. దీంతో తెలంగాణలో కారుకు ట్రక్కు చేసిన డ్యామేజ్ తరహాలోనే హెలికాప్టర్ గుర్తు ఫ్యాన్ ఓట్లను ఎగరేసుకుపోతుందా అనే చర్చ కూడా మొదలైంది. మొత్తానికి ఎన్నికల్లో ప్రధాన పోటీదారు కాకపోయినప్పటికీ... కేఏ పాల్ పార్టీ వైసీపీని కొంతమేర టెన్షన్ పెడుతున్నట్టు అర్థమవుతోంది. దీనికి తోడు వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగడం ఏపీలో సంచలనం రేపుతోంది. ఏపీలో 35 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లు వైసీపీ అభ్యర్థులను పోలి ఉన్నాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు.
కేఏ పాల్ తన ఎన్నికల గుర్తుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా ఒకే అభ్యర్ధి పేరుతో పాటు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు దగ్గరగా ఉండేలా హెలికాఫ్టర్ గుర్తు తెచ్చుకున్నారు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను వెతికి మరి పోటీకి దించారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే కేఏ పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచేసి తమ అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బకొట్టడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు కింద లేదా పైన హెలికాప్టర్ ఉండేలా ప్రత్యర్ధులు చూస్తున్నారని, దీంతో నిరక్షరాస్యులైన ఓటర్లు పొరబడే ప్రమాదం ఉందని అంటున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.