టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఉద్యమించినందుకే తనను, టీడీపీ నేతలను కేంద్రం టార్గెట్ చేసుకుంటోందని సీఎం రమేశ్ ఆరోపించారు. ఎన్ని దాడులు నిర్వహించినా, ఎంతగా హింసించినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నవేళ హైదరాబాద్ తో పాటు కడప జిల్లాలోని ఆయన స్వగ్రామం పోట్లదుర్తిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ కు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోట్లదుర్తి ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం నిరంకుశ వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్, మోదీ-కేడీ అంటూ నినాదాలు చేశారు. సీఎం రమేశ్ ఇంటి వద్దకు చేరుకుని ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అనతరం అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో.. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు – యర్రగుంట్ల రహదారిని దిగ్భందించిన టీడీపీ శ్రేణులు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీజేపీ నేతలు కుట్రతోనే ప్రభుత్వ సంస్థలను సీఎం రమేష్పైకి ప్రయోగించారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. అయితే వీరు కంట్రోల్ తప్పి, ఐటి అధికారుల పై దాడుల చేస్తారేమో అని పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్సు ని దింపారు. ఇదే సందర్భంలో సియం రమేష్, అక్కడి వారితో మాట్లాడుతూ, ఏ విధమైన చర్యలకు పాల్పడవద్దని, ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపాలని, వారి పని వారిని చేసుకోనివ్వండి అంటూ పిలుపు ఇచ్చారు. అక్కడ వారికి ఏమి దొరకవని, మనలని మానసికంగా ఇబ్బంది పెట్టటానికి మోడీ పంపిస్తే వచ్చారని, అది వాళ్ళ వృత్తి ధర్మం అని, వారి పని వారిని చేసుకోనివ్వండి అంటూ అన్నారు.