కడప జిల్లాలో తెదేపా వైరివర్గాలు ఒక్కటవుతున్నాయి. ఎన్నికల్లో గెలవాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ నాయకులంతా మిత్రులుగా మారుతున్నారు. తాజాగా కమలాపురం నియోజకవర్గంలో విరోధులుగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి, వీర శివారెడ్డి ఒక్కటయ్యారు. పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని ముందుకొచ్చారు. జమ్మలమడుగు తరహాలో వీరిని కూడా కలిపేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి. కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మూడు దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఒకరు కడప ఎంపీ స్థానానికి, మరొకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి తెదేపా అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఇదే తరహాలో కమలాపురంలో కూడా పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఒక్కటయ్యారు. వీరిమధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కమలాపురం స్థానాన్ని పుత్తా నరసింహారెడ్డికి తెదేపా కేటాయించింది. దీంతో వీరశివారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో శుక్రవారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వీర శివారెడ్డికి ఫోన్ చేశారు. కడప ఎంపీ, కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన మంకుపట్టు వీడారు. ఈ మేరకు శనివారం ఉదయం కమలాపురం వెళ్లి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు తెలపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అనంతరం పుత్తానరసింహారెడ్డితో భేటీ అయ్యారు.