టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో సుమారు 50 మంది పోలీసులు సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు పోట్లదుర్తిలోని రమేష్ నివాసంలో తనిఖీలు జరిగాయి. పోలీసులు వచ్చినప్పుడు రమేష్ ఇంట్లోనే ఉన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. పోట్లదుర్తిలోని ఆయన ఇంటిలోకి 50 మందికి పైగా పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు సీఎం రమేష్ బెడ్‌రూమ్‌లోకి సైతం ప్రవేశించారు. దీంతో టీడీపీ ఎంపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే ఎస్పీ ఆదేశం మేరకే సోదాలు చేస్తున్నామని చెప్పారు
దాదాపు గంటసేపు తనిఖీలు కొనసాగాయి. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఇదే సమయంలో రమేష్‌ను పోలీసులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. మొన్న టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు సీఎం రమేష్ అక్కడికి వెళ్లారు. ఎవరి ప్రొద్భలంతో ఈ సోదాలు చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. కడప జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు సీఎం రమేష్ అండగా ఉంటున్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేసినట్లు టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. కడప జిల్లా ఎస్పీని ఇటీవలే ఈసీ బదిలీ చేసింది. వైసీపీ నేతల పిర్యాదుతో రాహుల్ దేవ్‌ను బదిలీ చేసి ఆ స్థానంలో అభిషేక్ మహంతిని నియమించారు. ఇప్పుడు ఆయన ఆదేశాల మేరకే పోలీసులు తనిఖీలు చేశారు.
పోలీసుల తనిఖీలపై సీఎం రమేష్ మండిపడ్డారు. కేవలం తెదేపా నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ తనిఖీలు జరిగినట్లు అనుమానం కలుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం తమ వైపు ఉన్నంతవరకూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. బెదిరిస్తే భయపడేందుకు సిద్ధంగా లేమని, ఇవన్నీ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించేందుకేనని ఆరోపించారు. ప్రజల నుంచి సానుభూతి కోసం వైకాపా నేతలు ఎన్ని నాటకాలైనా ఆడతారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని భాజపా, జగన్ కుమ్మక్కై ఈ దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు.