వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై భారత ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలతో, తన పై చర్యలు తీసుకోవటం పై, కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కూడా ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసారు. నిన్న శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల వెంకటరత్నం కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కూడా లేఖ రాసారు. వైకాపా నాయకులు తనపై భారత ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై తగిన విచారణ జరిపించాలని... బదిలీ అయిన కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కోరారు. విచారణలో తన తప్పుందని తేలితే... తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవొచ్చని, లేనిపక్షంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఈ మేరకు బుధవారం ద్వివేదీకి ఆయన లేఖ రాశారు. ‘‘ఫిబ్రవరి 18న కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు చేపట్టా. అప్పటి నుంచి జిల్లాలో పర్యటిస్తున్నా. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా. అయితే మంగళవారం రాత్రి నన్ను బదిలీచేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఏ కారణంతో బదిలీ చేస్తున్నారనేది అందులో ప్రస్తావించలేదని’’ లేఖలో పేర్కొన్నారు. "వైకాపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నాపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఏ ఆరోపణలు ఆధారంగా చర్యలు తీసుకున్నారో అర్థం కావట్లేదు. నాపై వచ్చిన ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరిపిందా? లేదా? అనేది కూడా తెలీదు. 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారినైన నేను ఎనిమిదేళ్లుగా సర్వీసులో ఉన్నా. ఎలాంటి మచ్చ లేని రికార్డు నాకుంది. కానీ ఎన్నికల సంఘం ఆకస్మికంగా బదిలీ చేయటం నా నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉంది. అందుకే వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తప్పెవరిదో తేల్చండి. " అని అన్నారు.