కియా రాకతో అనంతపురం ఎలా మారిపోయిందో, ఇప్పుడు కాకినాడ కూడా అలా మారే అవకాసం కనిపిస్తుంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో మెగా పెట్రోకెమికల్ ప్రాజక్ట్ ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశ మందిరంలో సీఎస్ అనిల్‌చంద్ర పునీఠ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజక్ట్ విషయమై చర్చించారు. హల్డియా పెట్రోకెమికల్స్ సంస్థతో కలసి టీసీజీ రిఫైనరీ లిమిటెడ్ ఈ కెమికట్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ప్రాజక్ట్ ని చేపట్టడానికి ముందుకు వచ్చినట్లు అధికారులు సీఎస్ కు వివరించారు.
ఆ సంస్థ ప్రతిపాదించిన ప్రకారం అయిదు ఏళ్లలో పూర్తి అయ్యే ఈ ప్రాజక్టుకు దశలవారీగా రూ.62 వేల కోట్ల పెట్టుబడి పెడతారని, ప్రత్యక్షంగా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజక్టుకు అవసరమైన 2500 ఎకరాల ప్రైవేటు భూములను ఆ సంస్థ కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రవేట్ భూముల ధరలు, పెట్టుబడులు, జీఎస్టీ, బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్(ఇఐడిఎఫ్), కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్, ఎక్సట్రనల్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్, విద్యుత్ సబ్జిడీ తదితర అంశాలను చర్చించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ డి.సాంబశివరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వళవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్ తదితరులు పాల్గొన్నారు.