ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాను పణంగా పెడుతున్న అధికార పక్షం గురించి, నివారణ చర్యల గురించి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కళా వెంకట్రావ్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, లేఖ రాసారు. ఇది ఆ లేఖ. "కరోనా రక్కసి ప్రపంచ మానవాళి బతుకులకు సవాలు విసురుతున్న తరుణంలో.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి భౌతిక దూరం పాటించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ మూడో దశకు చేరుకుంది. ఇప్పటికే 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అధికార పార్టీ నాయకులకు రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశ్య పూర్వకంగా గుంపులుగా వస్తూ కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా కారకులవుతున్నారు. తత్ఫలితంగా కరోనా మహమ్మారి ఒకరి నుండి మరొకరికి వేగంగా విస్తరించి ప్రజల ప్రాణాలకు పెను ముప్పుగా మారుతోంది. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యధేచ్ఛగా తిరుగుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు."
"ఇలాంటి సమయంలో విజయసాయి రెడ్డి వందలాది మందిని వెంటేసుకుని ప్రగతి భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజల్లో తిరగడం ప్రజా హక్కుల ఉల్లంఘనగానే భావిస్తున్నాం. లాక్ డౌన్ ఉన్నపుడు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లకూడదని ప్రజల్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ.. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ తిరిగారు. నిన్నటికి నిన్న.. అమరావతిలో కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నిక కమిషనర్ ను కలవడానికి వచ్చారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తమిళనాడు నుండి ఏపీకి వచ్చారు. వారికి క్వారంటైన్ నిబంధలను ఎందుకు వర్తింప చేయలేదు? చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంద మంది కార్యకర్తలను వెంటేసుకుని ప్రజల వద్దకు వెళ్తున్నారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఊరేగింపుతో కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. ఇతర వైసీపీ నేతలు నగదు పంపిణీ, సరుకు పంపిణీ పేరుతో జనాలను పోగేస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్‌గౌడ్ లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి, విపత్కర సమయంలో వందల మందిని పోగేసుకుని కల్వర్టు ప్రారంభోత్సవం చేశారు. దాన్ని ప్రసారం చేసినందుకు మీడియాను కూడా తూలనాడుతూ వీడియో కూడా రిలీజ్ చేశారు. మంత్రి ఆదిమూపు సురేష్ కరోనా నిబంధలను ఉల్లంఘించి పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లి, తిరిగి ఏపీకి వచ్చారు."
"చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండంలోని ముక్కరాజు పల్లి ఇసుక రీచ్ లో ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి బావమరిది వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవానిపాలెంలో లాక్‌డౌన్‌లోనూ వైసీపీ నేతలు ఇసుక తవ్వకాలు చేయడాన్ని గ్రామస్తులే అడ్డుకోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పసునూరు కొత్తపల్లిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ నడి బొడ్డులో మంత్రి అనుచరులు ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తుండగా ప్రజలు అడ్డుకున్నారు. కరోనా వైరస్‌తో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈలు ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. దీనివల్ల వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. అందువల్ల వెంటనే పీపీఈలు అందించే ఏర్పాట్లు చేయించాలి. మాస్కులు అడిగినందుకు విశాఖపట్నంలో డా॥ సుధాకర్‌ను, చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమీషనర్ వెంకట్రామిరెడ్డిని విధుల నుంచి తొలగించారు. రేషన్ దుకాణాల వద్ద వందల సంఖ్యలో గుమికూడే విధంగా ప్రభుత్వం చేస్తున్నది. ఇది కరోనా వ్యాప్తిని పెంచుతుంది. కనుక డోర్ డెలివరీకి చర్యలు తీసుకోవసిందిగా విజ్ఞప్తి." అంటూ లేఖ రాసారు.