మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు కుట్రలకు తెరతీశారు. ప్రజల అభిమానం చూరగొనడంలో ఘోరంగా విఫలమైన వైసీపీ నేతలు నేరగాళ్ల ముఠాలను దింపింది. తాము గెలిస్తే ఏం చేయగలమో చెప్పుకొని ఓట్లడిగేవారు కొందరైతే దొడ్డిదారి ప్రయత్నాలతో ముందుకెళ్లాలని మరికొందరు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేసిందో చెప్పుకుంటూ తాము గెలిస్తే ఇంకా ఏం చేయగలమో హామీ ఇస్తూ ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారిని ఽడీకొనడానికి వైసీపీ అభ్యర్థుల వద్ద సరైన మార్గం లేక అడ్డదారులను వెతుక్కుంటున్నట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ ఎక్కడికక్కడ ఇచ్చిన సూచనలతో టీడీపీకి చెందిన ఓటర్లను రద్దు చేయించే కుట్ర ఫారం-7 ద్వారా బయటపడింది. టీడీపీ నేతలు ఆ కుట్రను ముందుగానే పసిగట్టి ఓట్లు రద్దు గాకుండా అడ్డుకున్నారు. ఆ పన్నాగం పారలేదని ఎక్కడికక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా రాయదుర్గంలో భీమవరం నుంచి నేరగాళ్లను రప్పించి ప్రచారంలో వేసిన ఎత్తులు బయటపడ్డాయి. అలాగే రాప్తాడులోనూ కర్ణాటక నుంచి రప్పించిన బృందాలు కూడా పట్టుబడ్డాయి. మంత్రి కాలవ శ్రీనివాసులు కదలికలపై వైసీపీ నిఘా పెట్టింది. ఆయన కదలికలను ఎప్పటికప్పుడు వీడియోల్లో బంధిస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రచారాల వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారు. దీని కోసం భీమవరం నుంచి మనుషులను రప్పించారు.
300 మంది దాకా నియోజకవర్గంలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి వియ్యంకుడు శ్రీరామరెడ్డికి చెందిన మనుషులుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా భీమవరం బ్యాచ్ నుంచి ముప్పు ఉందని ఇప్పటికే మంత్రి కాలవ శ్రీనివాసులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా వీరిని అంతదూరం నుంచి ఎందుకు రప్పించాల్సి వచ్చిందనే సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీరికి సంబంధించి పూర్తి బాధ్యతను వైసీపీ తీసుకోవడంలో అంతర్యం ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది.