మెగా స్టార్ చిరంజీవి, సినిమాల్లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో, రాజకీయాల్లోకి వచ్చి అంతే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పార్టీ పెట్టి, కాంగ్రెస్ లో విలీనం చేసి, మంత్రి పదవి అనుభవించి, మళ్ళీ రాజకీయాలకు దూరం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా. ఎన్నో మాటలు చెప్పి, ప్రస్తుతానికి ఒక్క సీటుతో సరి పెట్టుకుని, భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న నెలకొంది. అయితే చిరంజీవి రాజకీయాలు ఆపేసి, ఇప్పుడు సినిమాల పైనే ద్రుష్టి పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే భారీ సినిమా తీస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంలో, చిరంజీవి, ఈ సినిమా ప్రొమోషన్ లో బిజీగా ఉన్నారు. వివిధ భాషల్లో వస్తున్న ఈ సినిమా పై, చిరంజీవి తమిళనాడులో కూడా ఈ సినిమా ప్రమోషన్ కు వెళ్లారు. అక్కడ, ఓ తమిళ్ పత్రిక ఇంటర్వ్యూలో, రాజకీయాల పై మాట్లాడిన చిరంజీవి, అక్కడ సూపర్ స్టార్ట్ లు అయిన, రజనీకాంత్, కమల్ హాసన్ కు, రాజకీయాల పై సలహాలు ఇచ్చారు.
రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వద్దు అంటూ చిరంజీవి సలహా ఇచ్చారు. రాజకీయాలు అంటే టీ తాగినంత ఈజీ కాదని, సున్నిత మనస్తత్వం ఉన్న వారు, రాజకీయాలకు పనికిరారని చెప్పారు. ఎదురు దెబ్బులు తినటానికి సిద్ధపడితే, రాజకీయాల్లో ఉండండి, ఎప్పుడో సక్సెస్ అవుతారు అని చిరంజీవి అన్నారు. ఇలాగే తన రాజకీయ జీవితం గురించి, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి చెప్తూ, 2009లో తాను తిరుపతి..పాలకొల్లులో పోటీ చేస్తే సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఓడిపోయానని గుర్తు చేసారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ గాజువాక తో పాటుగా సొంత జిల్లాలోని భీమవరం నుండి పోటీ చేస్తే రెండు చోట్ల ఓడారని, అయితే తమ ఓటమికి డబ్బు ప్రభావమే కారణం అని చిరంజీవి అన్నారు. ఇలాంటి పరిస్థితులో రాజకీయాలు ఉన్నాయని, అందుకే తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయాలకు రావద్దు అంటూ సలహా ఇచ్చారు.
కమల్ హసన్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో, విజయం సాధిస్తుందని భావించానని, కాని ఎక్కడా గెలవలేదని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి వ్యాఖ్యల పై, కమల్‌హాసన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి వ్యాఖ్యల పై, కమల్ మాట్లాడుతూ "గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం వచ్చానని చెప్పారు. చిరంజీవి, నాకెప్పుడూ సలహాలు ఇవ్వోద్దంటూ కమల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం వల్లే ప్రజల ఆలోచనా ధోరణి పై అవగాహన పెరిగిందని కమల్ చెప్పారు. అయితే కమల్ ఇంత ఘాటుగా స్పందించటం, చిరంజీవి సలహాలు అవసరం లేదు అని చెప్పటంతో, ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.