రాష్ట్రంలో మూడు రాజధానుల పై, జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో, రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. అయితే వీరికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ నాయకులు, వీరికి మద్దతు పలుకుతున్నారు. అలాగే రేపటి నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వీరికి మద్దతుగా వివిధ వర్గాలు, ఆందోళన కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంది. అయితే వీరికి, ఇప్పుడు హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి కూడా మద్దతు పలికారు. ఆయాన ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. మందడంలో ఆందోళన చేస్తున్న రైతులు చేస్తున్న దీక్షలో కూర్చుని సంఘీభావం ప్రకటించారు. గతంలో అమరావతి పై అందరూ చర్చించి, అసెంబ్లీలో కూడా ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే అందరూ ఒప్పుకున్నారని, తరువాతే ఇక్కడ శంకుస్థాపన చేసారని అన్నారు. ఈ తరుణంలో అమరావతి పై చర్చలు, కమిటీలు అవసరమే లేదని కమలానంద భారతి అన్నారు.
అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజు అందరూ ఒప్పుకుని, ఇప్పుడు మార్చుతాం అని చెప్పటం కరెక్ట్ కాదని అన్నారు. ముద్ద ముద్దకూ బిస్మిల్లా చేయరని, అలాగే రాజధానికి అనే దానికి ఒక్కసారే శంకుస్థాపన చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి కోసం చేస్తున్న ఉద్యమాన్ని కొనసాగించాలని, ఈ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, కమలానంద అన్నారు. మీ భద్రత, భవిష్యత్, జీవితం అంతా అమరావతితోనే ముడిపడి ఉందని, దాని కోసం మీరు పోరాడి సాధించుకోవాలని అన్నారు. అమరావతి రాజధాని అనేది, 29 గ్రామాల ప్రజల రాజధాని కాదని, 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అని, రాజధాని అభివృద్ధి చెందితే, ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని కమలానంద భారతి తెలిపారు.
అమరావతి ఏర్పాటు అనేది దైవ నిర్ణయమని, ఈ ప్రాంతానికి దేవతల ఆశీస్సులున్నాయన్నారు. అమరావతి అనే దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. వచ్చే 5-10 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని జోస్యం చెప్పారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడటంతో మబ్బులు ఎక్కువగా కమ్ముకున్నాయని, మబ్బులు విడిపోయాక మామూలు వాతావరణం వస్తుందని అన్నారు. డిసెంబర్ నెలలో అమరావతికి కొద్దిగా ఇబ్బందులు వస్తాయని, అయితే సంక్రాంతి తరువాత, అమరావతి పై ఏర్పడ్డ వివాదాలు అన్నీ తొలగి పోతాయని ఆయన అన్నారు. 29 గ్రామాల్లోని ప్రతి గ్రామంలో ఉన్న అమ్మవార్లకు పూజలు జరపాలని పిలుపునిచ్చారు. అధైర్యపడి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన రాజధాని రైతులకు చెప్పారు.