స్వరూపానంద లాంటి స్వాములు, జగన్ మోహన్ రెడ్డి కోసమే మా శారదా పీఠం పని చేసింది, మా పీఠంలో ప్రతి మొక్క వైఎస్ జగన్ సియం అవ్వటం కోసమే పని చేసింది అని ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో, ఈ స్టేట్మెంట్ పెద్ద దుమారమే రేపింది. హిందూ ధర్మ పరిరక్షణ చేస్తూ, ప్రభుత్వానికి తగు రీతిలో సూచనలు ఇవ్వకుండా, ఇలా వ్యక్తి భజన చెయ్యటం, ఎలాంటి ధర్మం అంటూ ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే వైసిపీ మాత్రం, దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంది. జగన్ మోహన్ రెడ్డి పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఉందని, కానీ ఆయన హిందూ వ్యతిరేకి కాదని, స్వరూపానంద చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్సనం అని వైసిపీ ప్రచారం చేసుకుంది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ, అటు బీజేపీ, ఇటు కొంత మంది స్వాములు కూడా గళం విప్పుతున్నారు.
తాజగా స్వామి కమలానందభారతి, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం రెండు మతాలను తృప్తిపరిచేలా జగన్ ప్రభుత్వ పరిపాలన సాగుంతుందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి స్వామి కమలానందభారతి ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న పలు అంశాల పై తన అభిప్రాయాలను తెలిపారు. లౌకిక ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి, అన్ని మతాలను ఒకేలా చూడాలని, ప్రభుత్వాలు అలా నడవాలని అన్నారు. పాస్టర్లకు, మసీదుల్లో పనిచేసేవారికి జీతాలు ఇస్తున్నారని, ఇచ్చుకుంటే ఇచ్చుకోండి కాని, దేవాదాయ, ధర్మాదాయ శాఖలాగే వారికి కూడా ఒకదాన్ని ఏర్పాటు చేసి జీతాలు ఇవ్వాలని సలహా ఇచ్చారు.
ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై సంచలన ఆరోపణలు చేసారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా క్రైస్తవ మత వ్యాప్తి చేసే కుట్రదాగి ఉందని స్వామి కమలానందభారతి ఆందోళన వ్యక్తం చేశారు. దీని పై పోరాటం చేస్తామని అన్నారు. అలాగే దేవాదాయ శాఖలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేయకూడదు అని అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి, అక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై చట్టాలు కూడా ఉన్నాయని, దేవాదాయ ధర్మాదాయ చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉందన ఆయన తెలిపారు. దేవాలయాల భూములను అప్పనంగా పంచి పెట్టాలని చూస్తున్నారని, వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రయత్నిస్తే కోర్టుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంచటాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. అధిక ఖర్చు, రాజకీయ పునరావాసం తప్ప, దీని వల్ల ఉపయోగం లేదని అన్నారు. ప్రభుత్వాలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు.