బెజవాడ కనకదుర్గమ్మ భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి రావాల్సిందే. నూతన సంవత్సరం ప్రారంభం నుంచి ఈ నిబంధన అమలు కానుంది. జనవరి 1నుంచి సంప్రదాయ దుస్తుల్లో వచ్చినవారినే లోపలకు అనుమతించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఈవో కోటేశ్వరమ్మ నిర్ణయించారు. పురుషులు పంచె, ధోవతి, ప్యాంటు, చొక్కా ధరించి వచ్చినా దర్శనానికి అనుమతిస్తారు. మహిళలు చీర, చుడీదార్లో రావచ్చు. జీన్స్ ప్యాట్లు, టీషర్టులు, ఇతర పొట్టి దుస్తులతో వచ్చేవారిని మాత్రం అనుమతించరు. ఇలాంటివారు దుస్తులుమార్చుకోవడానికి వీలుగా కొండపై రిసెప్షన్ సమీపంలో ప్రత్యేకంగా ఓ గదిని కూడా ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు అమ్మవారి చీరలను తక్కువ ధరకే విక్రయించనున్నారు.
విజయవాడ అనగానే అందరికి ముందుగా గుర్తోచ్చేది దుర్గ గుడి. ఇక్కడికి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. శుక్రవారం రోజున మాత్రం దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దుర్గమ్మను దర్శించుకొనేందుకు వచ్చే యువతులు కొంతమంది డ్రెస్ సెన్స్ ఇప్పుడు అధికారులను ఆలోచనలో పడేసింది. సంప్రదాయానికి విరుద్ధంగా టీషర్ట్, జీన్సుల్లో దర్శనానికి వస్తుండటంపై కొందరు భక్తులు మండిపడుతున్నారు. డ్రస్ కల్చర్ పై వస్తున్న ఆరోపణలపై దుర్గ గుడి అధికారులు అలర్ట్ అయ్యారు. గుడి పరిసర ప్రాంతాల్లో పాశ్చాత్య సంస్కృతికి చరమ గీతం పాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈఓ కొటేశ్వరమ్మ ఆలయ అధికారులతో చర్చించి ఈ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన గత ఈవో సూర్యకుమారి.. ఇదే ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే, వరుస వివాదాలు రావడంతో ఈ ప్రతిపాదన పెండింగ్ లోనే ఉండిపోయింది. తాజాగా ఈఓ కొటేశ్వరమ్మ ఈ అంశంపై ఆలయ ప్రధాన అర్చకుల సలహాలు తీసుకున్నారు. ప్రస్తుతం టిటిడితో పాటు కొన్ని ముఖ్య దేవాలయాల్లో డ్రస్ కోడ్ అమలవుతోంది. ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన ఉంది. మరో పక్క కొత్త ఏడాది ఆరంభమైన రోజు కావడంతో జనవరి 1న భక్తులు దుర్గమ్మ ఆలయానికి పోటెత్తారు..