దుర్గమ్మ కొండపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఆలయం ఆవరణలో తెలంగాణ నేత తలసాని రాజకీయ ప్రకటన చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికంగానే ఉండాలంటూ కొత్త నిబంధనలు విధించింది. ఆలయం పరిసరాల్లో రాజకీయాలు మాట్లాడకూడదని, ఎటువంటి ప్రెస్‌మీట్‌లకు అనుమతి లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారపరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడితే చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు హెచ్చరించారు. ఇటీవల దుర్గమ్మ దర్శనానికి వచ్చి కొండపై రాజకీయాలు మాట్లాడిన తెలంగాణ నేత తలసాని శ్రీనివాస యాదవ్ ఇంద్రకీలాద్రి ఆవరణలో రాజకీయ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ దుర్గమ్మ పర్యటనకు వచ్చిన సందర్భంలో సనత్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనరాదని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. టీఆర్‌ఎస్ నేతల పర్యటనల్లో పాల్గొంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టొద్దని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా..?
ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో జాబితా నుంచి 26కులాలను తొలగించి బీసీలకు అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడికి వచ్చి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన తలసానిపై మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసిన వారితో జగన్ అంటకాగుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో జతకట్టిన వైసీపీకి బీసీలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్ కౌగలించుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌తో స్నేహం తెలంగాణ కోసమేనా.. కేసీఆర్, కేటీఆర్ జవాబివ్వాలన్నారు. మోదీ చెప్పింది చేయడమే కేసీఆర్ కర్తవ్యమని సీఎం వ్యాఖ్యానించారు.