వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి షాక్ ఇచ్చారు. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరేందుకు వెళ్లి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టికెట్‌ను చంద్రబాబు వేరే వ్యక్తికి కేటాయించడంతో పులపర్తి టీడీపీకి రాజీనామా చేశారు. శనివారం వైసీపీలో చేరాలని నిర్ణయించుకుని పిఠాపురంలో జరిగిన జగన్ బహిరంగ సభకు హాజరయ్యారు. జగన్ ప్రసంగం ముగిశాక బస్సెక్కి ఆయనతో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం జగన్ కండువా వేసేందుకు ప్రయత్నించగా పులపర్తి తిరస్కరించారు. ఒప్పించేందుకు ప్రయత్నించినా అంగీకరించలేదు. జగన్ అవాక్కయ్యారు. తన చేతిలోనున్న కండువాను పక్కనున్న నేత చేతిలో పెట్టి పులపర్తిని పంపేయాలని సైగలు చేశారు.
ప్రజలకు అభివాదం చేసి పులపర్తి బస్సు దిగిపోయారు. తిరిగి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరలేదని, అక్కడ ప్రవర్తన, నియమాలు చూసి చేరకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయం పెద్దదేం కాదని చెప్పి వెళ్లిపోయారు. పులపర్తి తనకు ఎమ్మెల్సీ కావాలని అడిగారని.. ముందు మీరు పార్టీలో చేరండి... అన్ని విషయాలూ చర్చిద్దామని జగన్ ఆయనతో అన్నారని తెలిసింది. ఇదే సమయంలో జగన్ బలవంతంగా కండువా వేయడానికి ప్రయత్నించగా పులపర్తి ప్రతిఘటించారు. దీనిపై ఎమ్మెల్యేను రాత్రి 11 గంటల సమయంలో మీడియాతో ఫోనులో సంప్రదించగా.. కొందరు వైసీపీ నాయకులు తనను బలవంతంగా పిఠాపురం తీసుకెళ్లారని, వైసీపీలో చేరితే ఉన్నత పదవి ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పారు. అక్కడకు వెళ్లాక జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను వెనుదిరిగివచ్చినట్లు తెలిపారు. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఇక మరో పక్క, సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమాతో ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నేతలు గత అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తున్నారు. గత అయిదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందంటూ వైకాపా ప్రచారాన్ని నిర్వహిస్తుండగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అసంబద్ధ పొత్తుల అస్త్రాలను జనసేన సంధిస్తోంది. ఇలా అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు తమ అనుకూల అంశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.జిల్లాలో తెదేపా, వైకాపా, జనసేన, కాంగ్రెస్, భాజపా, సీపీఎం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశాయి.మరికొందరు స్వతంత్రంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా చివరి అంకానికి చేరింది. సోమవారం ఒక్కరోజే గడువు ఉండడంతో ఆరోజు మిగిలిన అభ్యర్థులంతా నామపత్రాల దాఖలుకు సన్నాహాలు చేస్తున్నారు.