దేశంలోని ప్రతిపక్షాల పై మోడీ, అమిత్ షా కక్ష సాధింపు కొనసాగుతూనే ఉంది. మొన్నటి దాక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండటంతో, ఇక్కడ వరుస పెట్టి ఐటి దాడులు చేపించి, ఇక్కడ ఎన్నికలు అయిపోగానే, వారిని బెంగుళూరు, చెన్నై పంపించి, అక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి కనిమొళి నివాసం, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. తూత్తుకుడిలోని కురింజి నగర్లో ఆమె నివసిస్తున్న ఇల్లు, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఐటీ విభాగానికి చెందిన పదిమంది సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు నగదు పంచిపెడుతున్నట్టు సమాచారం ఉందని, అందుకే ఈ సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు.
తలుపులు మూసివేసి తనిఖీలు కొనసాగించారు. డీఎంకే కోశాధికారి దురైమురుగన్, ఆయన కుమారుడు వేలూరు అభ్యర్థి కదిర్ ఆనంద్, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్, ఎమ్మెల్యే హాస్టల్లోని మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, ఉడుమలై రాధాకృష్ణన్ల గదుల్లో ఐటీ సోదాలు చోటుచేసుకున్నాయి. డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు జరుగుతున్నాయని, నెల రోజులుగా మూసి ఉన్న రాష్ట్రమంత్రుల గదుల్లో కంటితుడుపు కోసమే సోదాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను అస్తవ్యస్తం చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. డీఎంకేకు మచ్చ తీసుకొచ్చేందుకే ఇలాంటి సోదాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
ఇది ఇలా ఉంటే, డీఎంకే నేత కనిమొళి ఇంట్లో జరిగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాల్లో ఏమీ లభించలేదు. తూత్తుక్కుడి లోని ఆమె ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బును దాచారని, ఎన్నికల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో అధికారులు దాడి చేశారు. అయితే, సోదాల అనంతరం అధికారులు ఉత్త చేతులతో వెళుతూ, తమకు తప్పుడు సమాచారం అందిందని వ్యాఖ్యానించడం గమనార్హం. దాడి తరువాత కనిమొళిపై ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో ఐటి దాడులు చేసి, కనీసం ఒక రూపాయి కూడా పట్టుకోకుండా, కేసు పెట్టకుండా, వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇదంతా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి, మోడీ, షా లకు అనుకూలంగా ఉండే, జగన్, కేసీఆర్, అన్నాడీయంకేలకు లబ్ది చేకుర్చటానికి వేసే ఎత్తులు అని ప్రజలు గమనిస్తున్నారు.