రాష్ట్ర బీజేపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి.. పార్లమెంటు ఇన్‌చార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్ల నియామకాల్లో పార్టీని ఏళ్ల తరబడి నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ నేతల వారసులు, కుమారులకు పదవులు ఇస్తున్నారని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ‘సేవ్‌ ఏపీ బీజేపీ’ అనే నినాదం సోషల్‌ మీడియాలో, ఫోన్లలో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదా ఇస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిన బీజేపీపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వాణి బలంగా వినిపించేందుకు వెంకయ్యనాయుడు లాంటి నాయకుడు లేరు. రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వారు సంస్థాగత వ్యవహారాలపై కొంతకాలంగా మౌనం వహిస్తున్నారు.

kanna 21112018

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ తాజాగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు నియమితులైన ఈ 75 మంది నుంచే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారుచేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నియామకాల్లో కొన్నిటిని పార్టీలోని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ ప్రాతిపదికన వీరికి పదవులిచ్చారని కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నారు. ఈ మేరకు కన్నాకు రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వేరే పార్టీ నుంచి వచ్చిన రాష్ట్ర నాయకుడు తన సొంత లాభం చూసుకుంటున్నారని వారంతా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం.

kanna 21112018

ఎంతో మంది సీనియర్లు, సమర్థులు పార్టీలో ఉండగా అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా హ్యాండిల్‌ చేయలేని తోట సర్వారాయుడిని ఎలా కాకినాడ పార్లమెంటు కన్వీనర్‌గా నియమించారని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉంగరాల వెంకటరమణ (చినబాబు) కన్నాకు రాసిన లేఖలో గట్టిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుడి కుమారుడైనందుకే అర్హుడయ్యారా అని నిలదీశారు. పార్టీకి ఏ మాత్రం సేవచేయని సర్వారాయుడిని తనకన్నా పై స్థానంలో కన్వీనర్‌గా నియమించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తనకు కేవలం పాతికేళ్ల అనుభవమే ఉందని.. ఈ బాధ్యత నిర్వర్తించేంత అనుభవం, సామర్థ్యం తనకు లేవని.. అందుచేత కో-కన్వీనర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వ్యంగ్యంగా పేర్కొన్నారు. కాగా.. తాజా నియామకాలపై ఉత్తరాంధ్రలో జిల్లా స్థాయి నాయకుడు రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కోస్తాకు చెందిన మరో నేత ఫిర్యాదులతో ఢిల్లీకి బయల్దేరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read