బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడకు వెళ్తే అక్కడ, ప్రజలు తమ కోపాన్ని చూపిస్తున్నారు. మొన్న ఒక లారీ డ్రైవర్ చెప్పు విసిరితే, ఈ రోజు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర పర్యటన చేపట్టారు కన్నా లక్ష్మీనారాయణ. ఇందులో భాగంగా ఆయన ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన పై చెప్పు విసిరేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటనలు మరువక ముందే కన్నా కడప జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా, భారీ స్వగతం పలుకుతారని ఆశించారు. మిగిలిన చోట్ల మాదిరికాకుండా ఇక్కడ లక్ష్మీనారాయణకు ఘనమైన స్వాగతం లభించలేదు. ఒంటిమిట్టలో కన్నా ఒంటరి అవ్వాల్సి వచ్చింది.
రాజంపేటలో నిర్వహించే కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లాలనుకున్న కన్నా, మధ్య లో ఒంటిమిట్ట ఉండటంతో అక్కడ పార్టీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఆయన ఒంటిమిట్టలో ఆగాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. ఒంటిమిట్టలో కన్నాను రిసీవ్ చేసుకునేందుకు ఒక్కరు, ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. అక్కడ లోకల్ నాయకులు చెప్పినా ఎవరూ రాలేదు. ఇదే సమాచారం కన్నాకు అందింది. దీంతో ఆయన అసహనానికి గురయ్యి, ఇక చేసేది ఏమిలేక ఒంటిమిట్ట కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నేరుగా రాజంపేటకు వెళ్లారు. లోకల్ నాయకుల పై ఫైర్ అయ్యారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కన్నా రాక సందర్భంగా కార్యకర్తలను తరలించేందుకు నేతలు రెండు బస్సులను ఏర్పాటు చేశారు. చివరకు బస్సులో ఒక్కరంటే ఒక్కరు ఎక్కలేదు. ఈ రెండు బస్సులు ఖాళీగా కన్నా వెంట వెళ్లాయి. నెల్లూరు జిల్లా కావలిలో కన్నాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. కావలికి కన్నా వచ్చిన సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కన్నాపైకి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. దీంతో కలకలం రేగింది. చెప్పు విసిరిన వ్యక్తి ఉమామహేశ్వరరావుగా గుర్తించారు. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చెప్పు విసిరిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. విచక్షణారహితంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.