రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)పై వైసీపీ నేతల మాటల దాడిని ప్రస్తావిస్తూ కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం, కేంద్ర బలగాలను పంపించాలని, ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో, పలు విషయాలు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. ఎన్నికల కమీషనర్ పై అధికార వైసీపీ పార్టీ నేతల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తిట్టటం, కుల ప్రస్తావన తేవటం వంటి విషయాలు ప్రస్తావించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు పంపాలని ఆయన కేంద్ర హోంమంత్రికి లేఖలో రాసారు. రాష్ట్ర పోలీసుల సాయంతోనే వైసీపీ నేతలు నామినేషన్ల సందర్భంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇలా రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని జగన్ , మంత్రులు తీవ్రంగా విమర్శించారని, అసభ్య పదజాలంతో దూషించారని లేఖలో రాసారు.
ఎలక్షన్ కమీషనర్ కు అత్యున్నతస్థాయిలో కేంద్ర భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నని కన్నా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, రాష్ట్ర పోలీసు వ్యవస్థ కీలు బొమ్మగా మారిందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల వాయిదా అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై హర్షణీయమని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా నేతలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేయాలని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, వైకాపా నాయకులు రాజ్యాంగ వ్యవస్థల మీద మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు కుల ముద్ర వేసిన నేతలు... సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏ ముద్ర వేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి కూడా పరిమితులుంటాయని జగన్ తెలుసుకోవాలని తులసిరెడ్డి సూచించారు. అలాగే మహమ్మారి కరోనా వ్యాప్తి అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.