ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, చెలరేగిపోయారు. ఎప్పుడూ ఎన్నికలు ముందు వచ్చే పాల్, ఈ సారి కూడా ఎన్నికల ముందు ఎంట్రీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరింత డోస్ పెంచిన పాల్.. అసలు టీడీపీ, వైసీపీలకు డిపాజిట్లు రావని ఏపీకి కాబోయే సీఎంను తానేనని ఆయనకు ఆయనే జోస్యం చెప్పుకున్న సందర్భాలు గత నెల రోజులుగా కోకొల్లలు. అంతటితో ఆగని ఆయన ఏపీలో తమ పార్టీ ఎవ్వరికీ మద్దతివ్వదని.. మాతో కలసి పనిచేయాలనుకున్న పార్టీకి ఐదో, పదో సీట్లిస్తామని కూడా చెప్పుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తాజాగా కేఏ పాల్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
టీఆర్‌ఎస్ నేత కేటీఆర్, వైసీపీ అధినేత జగన్ భేటీతో ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. " వైఎస్ జగన్- కేటీఆర్ కలిసినందుకు ధన్యవాదాలు. వైఎస్ జగన్ తరఫున టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేయాలని కోరుతున్నాను. సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే జగన్ పార్టీకి డిపాజిట్లు దక్కవు. తెలంగాణలో కూటమి తరపున చంద్రబాబు ప్రచారం చేసినందుకే అక్కడ కూటమికి డిపాజిట్లు కూడా రాలేదు. చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచేది ప్రజాశాంతి పార్టీనే. జగన్ లక్ష కోట్లు దోచుకున్నట్లు రుజువైంది. జగన్‌పై 12 ఈడీ కేసులు ఉన్నాయి. కేసీఆర్‌కు నేను ఆంటే చాలా అభిమానం" అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని పాల్ బీజేపీకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. "కన్నా లక్ష్మీనారాయణను నేను కలిసిన సమయంలో టీఆర్ఎస్‌కు మద్దతు ఇమ్మని అడిగారని.. ఆయన ఎందుకిలా అన్నారో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థం అయింది. వైఎస్ జగన్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ఒక్కటే. నా మీద అవినీతి ఫైల్స్ ఉంటే కేసులు వేసుకోండి.. ఇది బీజేపీకి నా ఓపెన్ ఛాలెంజ్. ప్రధాని మోదీకి నాకంటే గతంలో సన్నిహితులు ఎవరూ లేరు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి నేను మద్దతు ఇస్తుంటే ఎల్‌కే అద్వానీ వద్దు అన్నారు. మోడీ మోసగాడు నన్నే మోసం చేశారు.. ఆయన్ను నమ్మొద్దు అని అద్వానీ నాతో స్వయంగా అన్నారు. ఇప్పుడు అదే మోసపూరిత రాజకీయాలు ఏపీలో కూడా మోడీ చేస్తున్నారు" అని పాల్ సంచలన ఆరోపణలు చేశారు.