కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అంశం పై, గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబుని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో చూసాం. అటు ముద్రగడ కాని, ఇటు జగన్ మోహన్ రెడ్డికి కాని, 5 ఏళ్ళు చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చంద్రబాబు వచ్చిన ఏడాదిలోనే రత్నాచల్ ఎక్ష్ప్రెస్ తగలుబెట్టి మరీ రాద్ధాంతం చేసారు. అటు తరువాత ముద్రగడ చేసిన ఆమరణ దీక్ష కాని, తరువాత చేసిన ఆందోళనలు కాని, దీనికి తోడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ప్రతి నిమిషం ఈ విషయంలో చంద్రబాబుని ఇబ్బంది పెట్టటం కాని, అన్నీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ముద్రగడ చేసే ప్రతి దీక్షకు, జగన్ పార్టీ మద్దతు పలికింది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా, రాజకీయంగా నష్టపోతాం అని తెలిసినా, ఆ రోజు చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి, కేంద్రానికి పంపించారు.
అప్పుడు కూడా చంద్రబాబు గేమ్ ఆడుతున్నారు అంటూ, కేంద్రం ఆమోదించక పోయినా, అటు ముద్రగడ కానీ, ఇటు జగన్ కానీ గేమ్ ఆడారు. తరువాత కేంద్రం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వటంతో, అందులో జనాభా ప్రకారం, 5 శాతం కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. అయితే ఈ కాపు రిజర్వేషన్లు కుదరవు అంటూ, అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన 5 శాతం ఎత్తేసారు. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. కాపులకు 5 శాతం కోటా సాధ్యపడదని ప్రభుత్వం ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తీ క్లారిటీతో శనివారం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
ఇది ఇలా ఉంటే, మరి ప్రతిపక్షంలో ఉండగా, కాపుల రిజర్వేషన్ల అంశం పై, చంద్రబాబుని అడుగడుగునా ఇబ్బంది పెట్టిన జగన్, అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే, చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేసారు. చాలా మంది కాపు యువత కూడా, పవనన్నకు ప్రాణం ఇస్తాం, జగనన్నకు ఓటు వేస్తాం అంటూ మొనట్టి ఎన్నికల్లో ప్రచారం చేసారు కూడా. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే, కాపులకు షాక్ ఇచ్చారు. చంద్రబాబు కంట్లో నలుసుగా ఇబ్బంది పెట్టిన ముద్రగడ గారు, ఇప్పటి వరకు ఈ విషయం పై నోరు తెరవలేదు. అదే చంద్రబాబుని అయితే రైళ్ళు తగలుబెట్టెలా ఉద్యమాలు చేసారు. మరి ఇది జగన్ ప్రభుత్వానికి వర్తించదా ?చంద్రబాబు మా పొట్ట కొట్టారు అని, పళ్ళెం, గరిట తీసి వాయించిన ముద్రగడ గారు, ఇప్పుడు జగన్ నిర్ణయం పై ఎలా స్పందిస్తారో ?