అవిశ్వాస తీర్మానం పెట్టి మోడీని ఉతికేసిన తెలుగుదేశం ఎంపీలు, ఆ వేడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి రోజు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఢిల్లీలో వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి, సమస్యల పై నిలదీస్తున్నారు. మొన్న రాష్ట్రపతిని కూడా కలిసి మోడీ పై ఫిర్యాదు చేసారు. ఒక పక్క సొంత రాష్ట్రంలో ధర్మ పోరాట దీక్షలు పెడుతూ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, ఢిల్లీ పై పోరాటాలకి ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో, కేంద్రం పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే దేశంలో అన్ని పార్టీలని కలిసి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పుడు విభజన హామీలే కాక, రాష్ట్రానికి చెయ్యవలసిన అనేక పనులను కేంద్రం ఎలా తొక్కి పెట్టింది అనే దాని పై కూడా పోరాటాలు చేస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశం. ఇప్పటికే రాష్ట్రం నుంచి, ఈ బిల్ కేంద్రానికి వెళ్ళింది. కేంద్రం ఆమోదిస్తే అయిపోయే దానికి, ఇప్పటి వరకు స్పందన లేదు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, చంద్రబాబు మోసం అంటూ నాటకాలు ఆడుతున్నారు. అందుకే అసలు కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకుని ప్రజల ముందు చూపించటానికి, తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహంతో ముందుకొచ్చింది. అదే కాపు రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు. కాపు రిజర్వేషన్లపై ఈరోజు లోక్ సభలో టీడీపీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ఆమోదముద్ర వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు.
కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీలో వేడిని పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ చెబుతోంది. కేంద్రం చేతిలో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని తాము ఏమీ చేయలేమని చెప్పిన వైసీపీ అధినేత జగన్... తాము అధికారంలోకి వస్తే కాపుల సంక్షేమానికి రూ. 10 వేల కోట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జనసేన ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. అనకాపల్లి టిడిపి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలోనే కాపుల కష్టాలను చూసి బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేశారని,ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ లోక్‌సభలో పెడుతున్న ఈ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరముందన్నారు.