ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్న కేంద్రంలోని బీజేపీకి కర్నాటక ఎన్నికల్లో తమ వాడి చూపేందుకు కర్నాటకలో ఉన్న తెలుగు వారు సిద్ధమవుతున్నారు. రానున్న కర్నాటక ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పరితపిస్తున్న బీజేపీకి అక్కడి తెలుగువారు షాక్ ఇవ్వాలన్న పిలుపు సోషల్ మీడియా ప్రచార రూపంలో ఉధృతమవుతోంది. రానున్న కర్నాటక ఎన్నికల్లో, ముఖ్యంగా ఏపీకి, తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న సహాయ నిరాకరణకు ఓటు రూపంలో జవాబు చెప్పాలన్న ప్రచారం తెరపైకి రావడం ఆసక్తిక రంగా మారింది. బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కర్నాటక ఎన్నికల్లో ఓ వైపు విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అడుగులు వేస్తుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఆ పార్టీ చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణి అక్కడి తెలుగువారిలో బలంగా కనిపిస్తోంది.
ఆ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలు, పిలుపులు పరిశీలిస్తే తెలుగువాడి ప్రభావం ఎన్నికల్లో బీజేపీపై స్పష్టంగా చూపే ప్రమాదం కనిపిస్తోంది. కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలోని జయనగర్, జెపి నగర్, ఇందిరానగర్, కెఆర్ పురం, సదాశివనగర్, ఉత్తరెల్లి ప్రాంతాల్లో తెలుగువారి ప్రాధాన్యం అధికంగా ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగువారు పలు ఐటీ కంపెనీలతో పాటు, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక మైసూరు, బళ్లారి, చిక్బల్లాపూర్, హోస్పేట, కోలార్, సింధనూరు, చిత్రదుర్గ వంటి ప్రాంతాల్లో అయితే ఏపీకి చెందిన తెలుగువారు కొన్ని దశాబ్దాల క్రితమే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ-దేవెగౌడ సారథ్యం లోని జనతాదళ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో.. 5-10 వేల ఓట్లు ఏ పార్టీకయినా కీలకం కానున్నాయి. దీనిని తెలుగువారికి అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేక ప్రచార చేయడం ద్వారా, వినియోగించుకోవాలన్న అభిప్రాయం అక్కడి తెలుగు ఓటర్లలో వ్యక్తమవుతున్నట్లు అక్కడి నుంచి మొదలైన సోషల్ మీడియా ప్రచారంతో స్పష్టమవుతోంది. అందులో భాగంగా, శని-ఆది వారాల్లో తెలుగువారు నివసించే ప్రాంతాల్లోని టీ బంకులు, చౌరస్తాలు, అపార్టుమెంట్ కాంప్లెక్సులు, ఆఫీసు క్యాంటిన్లు, పార్కుల వద్ద గుంపులుగా ఏర్పడి, తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై చర్చించాలన్న పిలుపు సోషల్ మీడియాలో మొదలయింది. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి కర్నాటకలో బుద్ధి చెబితే తప్ప, ఆ పార్టీ ధోరణిలో మార్పురాదన్న అభి ప్రాయం ఇక్కడి తెలుగువారిలో ఉంది. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పాపంలో బీజేపీకీ పాత్ర ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నప్ప టికీ తెలుగువారంటే లెక్కలేకుండా చూస్తోందన్న ఆగ్రహం ఇక్కడి ప్రతి తెలుగువారిలోనూ ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలుగువారు ఏ పార్టీకి ఓటేసినా ఫర్వాలేదు, ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి మాత్రం వేయవద్దన్న నినాదంతో తెలుగువారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు...