రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మాధ్యమంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం పై, పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలోని చాలా మంది పిల్లలను వారి మాతృభాషలో నేర్చుకోవడాన్ని కోల్పోతుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును విద్యా మాధ్యమంగా మార్చడానికి ఆంధ్ర ప్రభుత్వం గత వారం ఒక చట్టాన్ని ఆమోదించింది, అదే సమయంలో విద్యార్థులు తెలుగు లేదా ఉర్దూను అదనపు భాషగా నేర్చుకోవాలని ఆదేశించారు. రాబోయే జూన్ నుండి విద్యా సంవత్సరంతో ప్రారంభించి, 1 వ తరగతి నుండి అన్ని సబ్జెక్టులకు బోధనా మాధ్యమంగా ఇంగ్లీషు దశలవారీగా ప్రవేశపెడుతుంది. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ తన అభిప్రాయాన్ని చెప్తూ, బలవంతంగా రుద్దటం కరెక్ట్ కాదని, పిల్లలకు, తల్లిదండ్రులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్స్ ఇవ్వాలని కోరింది. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
అయితే ఈ ఇంగ్లీష్ మీడియం పై, కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్, జగన్ కు లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టటం వలన, కన్నడ భాష కనుమరుగవుతుందని సురేష్ కుమార్ లేఖలో రాసారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు వంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటున్న కన్నిడిగులకు, ఇప్పటి వరకు కన్నడలో బోధన చేస్తున్నారు. ఇప్పుడు ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, తమ విద్యార్థులు ఇబ్బందులు పడతారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. కన్నడ భాషను తప్పనిసరి బోధనా మాధ్యమంగా, మారచాలని, అలాగే సంబంధిత పాఠశాలల్లో కన్నడ భోధన కొనసాగించడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఏపి ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో కన్నడ నేర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఐసిఎస్‌ఇ సిలబస్ ఉన్న పాఠశాలల్లో, కన్నడను తప్పనిసరి రెండవ భాషగా మార్చింది అక్కడి ప్రభుత్వం. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, కర్ణాటకలో స్థిరపడిన వారు, దీంతో ఇబ్బంది పడ్డారు. అయినా సరే, ఇక్కడ ఉండే వారు కన్నడ నేర్చుకోవలసిందే అని, అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చెయ్యటంతో, సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా ఉండే కన్నడిగులు ఇబ్బంది పడతారని, అందుకే ఇప్పటికే ఉన్న కన్నడ మీడియం కొనసాగించాలని ఆయన ఉత్తరం రాసారు. మరి జగన్ దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి.