ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం చేస్తున్న దీక్షకు మద్దతుగా బెంగళూరులోని జిగిణీ పురసభలో ఉంటున్న తెలుగు ప్రజలు అమరావతికి వచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తమ సంఘీభావం తెలిపారు. చంద్రబాబునాయుడు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలిపేందుకు వచ్చామని కర్ణాటక రాష్ట్ర పొట్టిశ్రీరాములు తెలుగు సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఆయన పోరాటం ఎంతో ఉత్తమమైనదిగా అభివర్ణించారు. సంఘం గౌరవాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు వెంకటరామిరెడ్డి, వీరనారాయణ, కోశాధికారి హరినాథ్, పాలకవర్గ సభ్యులు, జిగిణీలోని తెలుగువారు ముఖ్యమంత్రి నివాసం వద్ద ఫ్లెక్సీని ప్రదర్శించారు.
అనంతరం వీరనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ బెంగళూరు జిల్లా జిగణి పురసభలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గుర్తించి, వారికి బాసటగా నిలిచేందుకు ఈ సంఘాన్ని స్థాపించామన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకుని, ప్రవాసాంధ్రులకు, వలస కార్మికులకు, తెలుగు పాఠశాలల అభివృద్ధికి తమ సంఘం ఉదాత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 2015 నుంచి అనేక సార్లు బెంగళూరు విధానసౌధ వద్ద ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించినట్టు వివరించారు.
ఏపీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబును కొనియాడారు. హోదా, విభజన హామీల అమలు సాధనకు చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కర్ణాటకలో, బీజేపీ ని ఓడించటానికి, తెలుగు వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో, బీజేపీ వ్యతిరేక ప్రచారం జరుగుతుంది... కర్ణాటకలో ఉంటున్న దాదాపు కోటి మంది తెలుగు ప్రజలు, కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చెయ్యనున్నారు..