డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) ఇకలేరు. గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది ఇలా ఉండగా, కరుణానిధి అంత్యక్రియలకు ఏర్పాట్లలో డీయాంకే పార్టీ సిద్దమవుతున్న వేళ, షాక్ తగిలింది. కరుణానిధి సమాధికి మెరీనా బీచ్‌లోని 'అన్నా మెమోరియల్' వద్ద స్థలం ఇవ్వాలంటూ డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సున్నితంగా తోసిపుచ్చింది. హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ స్థలం ఇవ్వడం సాధ్యంకాదని చేతులెత్తేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా గాంధీ మండపం సమీపంలో గిండీ వద్ద (అన్నా వర్శిటీ ఎదురుగా) రెండెకరాలు స్థలం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
రీనా బీచ్‌లో సమాధి చేస్తే ఆ తర్వాత స్మారక మందిర నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తెలిపింది. దీనికితోడు హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కాబట్టి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇస్తామని సర్కార్ స్పష్టం చేసింది. కరుణానిధి అంత్యక్రియలు మెరినీ బీచ్‌లోని అన్నా సమాధి పక్కనే అంత్యక్రియలు జరపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కరుణ అభిమానులు, డీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.