తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి కొద్ది సేపటి క్రిందట తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిటంతో హాస్పిటల్ లో చికిత్స పొందారు. జ్వరంతో పాటు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని రోజులు, చెన్నైలోని గోపాలపురం నివాసంలో ఆయనకు కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బృదం చికిత్సలు చేసింది. తరువాత పరిస్థితి విషమించటంతో హాస్పిటల్ లో చికిత్స అందించారు. ఈ రోజు ఆరోగ్యం మరింత క్షీణింటంతో, ఆయాన తుది శ్వాస విడిచారు.
డీఎంకే పార్టీ అధ్యక్షునిగా కరుణానిధి నాలుగు రోజుల క్రితం 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. అన్నాదురై ఏర్పాటు చేసిన డీఎంకే పార్టీ తొలుత 1967లో అధికారంలోకి వచ్చింది. అన్నాదురై మరణించాక 1969 జులై 27న డీఎంకే అధ్యక్షునిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఆ తర్వాత డీఎంకే నుంచి ఎంజీఆర్ విడిపోయి అన్నాడీఎంకే.. వైగో విడిపోయి ఎండీఎంకే.. ఇలా పలు పార్టీలు వచ్చాయి. 1971 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే సాధించిన విజయాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు.
ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా కరుణానిధి పేరుగడించారు. 13 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పలు నియోజక వర్గాల నుంచి గెలుపొంది ఖ్యాతి పొందారు. తమిళనాడు ప్రజలు ఆప్యాయంగా కలైజ్ఞర్ అని పిలుచుకునే కరుణానిధి 1924 జూన్ నెల 3వ తేదీన అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ముత్తు వేలన్, తల్లిపేరు అంజుగమ్మ. విజయ నగర సామ్రాజ్యధీసుల కాలంలో వీరి కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడుకు వలస వచ్చినట్లు చెబుతారు. ద్రావిడ భావజాలం, హేతువాద సిద్ధాంతాల పట్ల కరుణానిధికి ఉన్న నిబద్ధత, ఆయనకున్న వాక్పటిమ, రచనా పాటవం కారణంగా అనతికాలంలోనే డీఎంకేలోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరుగా ఆయన ఎదిగారు.
1967 డీఎంకే తొలిసారి తమిళనాట అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై కేబినెట్లో ప్రజాపనుల శాఖ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగాను, ద్రవిడ మున్నేట్ర కజగం అధ్యక్షునిగాను బాధ్యతలు చేపట్టారు. కరుణానిధి తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు. ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అత్యధిక కాలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఖ్యాతికెక్కారు.